*₹29,500 నగదు, 4 మొబైల్ ఫోన్లు, 1 బైక్, 1 కారు స్వాధీనం
*జూదం ఆడితే కఠిన చర్యలు
*జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టే దిశగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బుర్గుల్ గ్రామ శివారులో అక్రమంగా జూదం (Gaming) ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు సి.సి.ఎస్ (CCS) బృందం సంఘటనా స్థలానికి చేరుకుని జూదం ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకుంది.
ఈ ఆపరేషన్‌లో భాగంగా అక్రమ జూదానికి పాల్పడుతున్న నలుగురు (04) వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి నగదుతో పాటు రవాణాకు ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్నవి:
1.నగదు: రూ. 29,500/- , 2. మొబైల్ ఫోన్లు: 4, 3. వాహనాలు: 1 బైక్, 1 కారు
పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి విచారణ నిమిత్తం గాంధారి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ మేరకు గాంధారి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నామని అన్నారు. జూదం అనేది వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాలను నాశనం చేసే ప్రమాదకర అలవాటని అన్నారు. జూదానికి బానిసైన వారు అప్పుల బారిన పడి, కుటుంబ కలహాలకు గురై, చివరకు తీవ్ర నిర్ణయాలకు దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు.
జూదంలో ఎవరూ గెలవరని, నష్టపోయేది భవిష్యత్తేనని పేర్కొన్నారు.అందువల్ల ప్రజలు జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని,. ఎక్కడైనా ఇటువంటి కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా 100 నంబర్‌కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
కాగా సురక్షితమైన, శాంతియుతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలను అణచివేయడంలో భాగస్వాములు కావాలని జిల్లా పోలీస్ శాఖ కోరుతోంది.

Post a Comment