•శేఖాపూర్ శివారులో అగ్ని ప్రమాదం: వందల ఎకరాల్లో పంటలు బూడిద
•కాలి బూడిదైన మొక్కజొన్న, జొన్న పంటలు
•2 కి.మీ మేర విస్తరించిన అగ్నికీలలు
•రైతన్న కంట కన్నీరు
తెలంగాణ డైలీ న్యూస్, మద్నూర్: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం శేఖాపూర్ శివారులో బుధవారం చెలరేగిన మంటలు వందల ఎకరాల్లోని పంటలను దగ్ధం చేశాయి. బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు అగ్నికీలలు అదుపులోకి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందారు.
అధికారులు, స్థానికులు తెలిపిన ప్రకారం శేఖాపూర్, చిన్న ఎక్లారా శివారులో జొన్న, మొక్కజొన్న పంటలు సాగవుతున్నాయి. ఈ ప్రాంతంలో పలువురు రైతులు మక్క పంటను కోసి చేనులోనే కుప్పలుగా చేశారు. ఇప్పటికే కొంత మంది రైతులు పంట కోత కోయగా, మిగిలిన పంటలు కోత దశలో ఉన్నాయి. ఆ పంట ఆగ్నికి ఆహుతయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోతలు పూర్తయ్యాక చేనులోని చెత్తకు ఎవరైనా నిప్పు పెట్టడం వల్ల మంటలు చెలరేగాయా లేదా ఎవరైనా దుండగులు నిప్పంటించారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. సుమారు రెండు కి.మీ. మేర మంటలు వ్యాపించాయి.
మద్నూర్ ఫైర్‌స్టేషన్ నుంచి ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నా ఫలితం లేదు. వాహనంలోని నీళ్లు అయిపోయినా, ఫైర్ ఇంజిన్ పైప్ పొడవు సరిపోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో బాన్సువాడ అగ్నిమాపక కార్యాలయం నుంచి మరో రెండు వాహనాలను రప్పించినట్లు సర్పంచ్ తుకారాం తెలిపారు.
తహసీల్దార్ ముజీబ్, ఎంపీడీఓ రాణి గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పంట కోసిన తర్వాత మిగిలిన చెత్తకు నిప్పు అంటుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ చేపడతామని, పూర్తి వివరాలు విచారణ తర్వాత తెలుస్తాయని తెలిపారు.
పూర్తిగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపరిహారం అందించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
“చేతికి అందివచ్చిన పంట కళ్లముందే కాలి బూడిదైపోయింది సార్”_
శేఖాపూర్ శివారులో కాలిన పంటలు: కన్నీళ్లలో రైతన్న
బుధవారం సాయంత్రం సూర్యుడు పడమటికి వాలుతున్న వేళ శేఖాపూర్ రైతుల గుండె ఆగినంత పనైంది. తన ఎకరం మక్క పంటను కోసి కుప్పలుగా వేసి, రేపు లోడ్‌కు ట్రాక్టర్ వస్తుందని సంబరపడుతున్నాడు. కానీ ఒక్కసారిగా దూరంగా లేచిన పొగ, ఎగసిపడుతున్న అగ్నికీలలు చూసి గుండె గుభేల్‌మంది.
“ఆర్నెల్లు కష్టపడి పెంచినం. అప్పులు చేసి ఎరువులు వేసినం. పిల్లల ఫీజులు కట్టాలని, అప్పులు తీర్చాలని లెక్కలేసుకున్నం. ఇప్పుడు చూడండి సార్, ఒక్క పీకు మక్క కూడా మిగలలేదు” అంటూ ఆ రైతు కళ్లలో నీళ్లు తిరిగాయి.
ఆయన ఒక్కడే కాదు. చిన్న ఎక్లారా శివారులో దాదాపు 30 మంది రైతుల పరిస్థితి ఇదే. ఎవరి కుప్పలు వారి ముందే కాలి బూడిదయ్యాయి. మంటలు రెండు కిలోమీటర్లు వ్యాపించడంతో ఆర్పేందుకు వచ్చిన ఫైర్ ఇంజిన్ నీళ్లు సరిపోలేదు. రాత్రి 10 దాటినా మంటలు అదుపులోకి రాలేదు.
“పంట కోసిన తర్వాత చేనులోని చెత్తకు ఎవరో నిప్పు పెట్టి ఉంటారు. గాలి బలంగా ఉండటంతో ఒక్కసారిగా అన్ని కుప్పలకూ అంటుకుంది” అని గ్రామ సర్పంచ్ తుకారాం చెప్పారు.
రాత్రి చీకట్లో కాలి బూడిదైన తన చేను వద్దే కూర్చున్నాడు యువ రైతు. “బ్యాంకులో లక్ష రూపాయలు అప్పు ఉన్నది. ఈ పంట అమ్మితేనే తీర్చాలనుకున్న. ఇప్పుడు ఎలా సార్? పిల్లలను ఎలా చదివించాలి?” అని గద్గద స్వరంతో అడిగాడు.
తహసీల్దార్ ముజీబ్, ఎంపీడీఓ రాణి వచ్చి పరిశీలించారు. “విచారణ చేసి నివేదిక పంపిస్తాం. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చేలా చూస్తాం” అని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ రైతుల కడుపు నింపుతుందా అనేదే ప్రశ్న.
శేఖాపూర్‌లో ఈ రాత్రి చీకటి మరింత చిక్కబడింది. కాలి బూడిదైన పంటల పొగ గాలిలో కలిసిపోయింది. కానీ రైతుల కళ్లలో మాత్రం కన్నీళ్లు మిగిలాయి. పంటతో పాటు వారి ఆశలు కూడా కాలి బూడిదయ్యాయి.



Post a Comment