Low Quality Seeds | నాసీరకం విత్తనాలతో తగ్గిన దిగుబడి

బాన్సువాడ, నసరుల్లాబాద్, వర్ని మండలాల్లో వేయి ఎకరాల్లో పంట

ఎకరాకు 5 క్వింటాళ్ల లోపు దిగుబడితో రైతుల్లో ఆవేదన

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు దిగుబడి రాకుంటే తమ కష్టం నీళ్ల పాలై తీవ్ర మనోవేదనకు గురవుతారు. ప్రకృతి వైపరీత్యాలతో ఇలా జరిగితే భరించవచ్చు కానీ విత్తన కంపెనీలు నాసీరకం విత్తనాలు ఇస్తే...? మూడు నెలల పాటు కష్టపడ్డా దిగుబడి రాకుంటే...? ఎవరు బాధ్యులు? ఇలాంటి సంఘటనలు ప్రతీ ఏడాది రాష్ట్రం లో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పిడి యాక్టు పెట్టి లైసెన్స్ రద్దు చేస్తోన్నా మారడం లేదు. 

తాజాగా బాన్సువాడ, నస్రుల్లాబాద్, వర్ని మండలాల్లో రైతులు యాసంగిలో జేజీఎల్ 1798 రకం వరి విత్తనాలు వేయగా ఎకరానికి 5 క్వింటాళ్లు కూడా దిగుబడి రాలేదు. సుమారు 1000 ఎకరాల్లో పంట నష్టపోయింది. రైతుల ఫిర్యాదుతో వ్యవసాయ శాస్త్రవేత్తలు విత్తనాలు, పంట నమూనాలు పరీక్షకు తీసుకెళ్లారు. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని ఏడీఏ అరుణ తెలిపారు. ఓ కంపెనీకి చెందిన జేజీఎల్ 1798 పేరుతో ఉన్న విత్తనాలు వేసిన రైతులు వచ్చి ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమేనన్నారు. దిగుబడి తక్కువగా ఉందని చెప్పడంతో వెంటనే ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలకు సమాచారం ఇచ్చామని, వారు వచ్చి విత్తనాలు, కొంత పంట, గింజలను పరీక్షలకు తీసుకెళ్లారని తెలిపారు. దిగుబడి ఎందుకు తక్కువ వచ్చింది అనే అంశంపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని  ఆమె చెప్పారు.

బాన్సువాడ మండలం చింతల్‌నా గారం, హన్మాజీపేట, నస్రుల్లాబాద్ మండలం దుర్కి, మైలారం, వర్ని మండలం జలాల్‌పూర్ తదితర గ్రామాల రైతులు ఓ కంపెనీకి చెందిన జేజీఎల్ 1798 పేరుతో ఉన్న వరి విత్తనాలు వేశారు.

తమకు ఎకరానికి 5 క్వింటాళ్ల దిగుబడులు కూడా రావడం లేదని రైతులు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. పొలంలో ఒకే రోజు వేసిన పంట వివిధ దశల్లో ఉందని కర్షకులు చెబుతున్నారు.

ఈ విత్తనాలు నియోజకవర్గంలో సుమారు వెయ్యి ఎకరాలకు సరఫరా అయినట్లు అధికారులు చెబుతున్నారు.

రైతులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు జగిత్యాల నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలను పిలిపించి దిగుబడి రాకపోవడానికి కారణాలు తెలుసుకుంటున్నారు.

కాగా చేతికొచ్చిన వరిలో సరైన దిగుబడి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

 

Post a Comment

Previous Post Next Post