•ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ పకడ్బందీగా అమలు చేయాలి
•మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదేశం
•కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను జిల్లాల్లో పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అధికారులను ఆదేశించారు.
శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర నీటిపారుదల, విద్యుత్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలు, నీట్ పరీక్ష నిర్వహణ, ధాన్యం కొనుగోలు, ప్రజావాణి అంశాలపై చర్చించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కలెక్టరేట్ నుండి పాల్గొన్నారు.
మంత్రి ఆదేశాలు:
1. రైతు వారోత్సవాలు: మే 4 నుండి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, పంటల వైవిధ్యీకరణ, ప్రభుత్వ పథకాల వినియోగంపై అవగాహన కల్పించాలి. నేల నమూనాల సేకరణ, ఉద్యాన పంటల ప్రోత్సాహం, పంట రుణాల అవగాహన, వ్యవసాయ డ్రోన్ ప్రదర్శనలు, కుసుమ్ పథకం ప్రచారం, పశుసంవర్థక మరియు మత్స్యశాఖ కార్యక్రమాలు, కాలువల శుభ్రత, నీటి వనరుల సమర్థ వినియోగంపై కార్యక్రమాలు నిర్వహించాలి.
2. ధాన్యం కొనుగోలు: రాబోయే సీజన్‌లో సుమారు 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా ఉండగా, 90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రైతులకు ఇప్పటివరకు రూ.581.72 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. ట్యాబ్ ఎంట్రీలు, రవాణా, కార్మికుల అందుబాటు, గోనె సంచుల సరఫరా, హార్వెస్టర్ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
3. ఉపాధి హామీ: పనితీరు తక్కువగా ఉన్న మండలాలు, గ్రామ పంచాయతీలను ప్రత్యక్షంగా సందర్శించి పనుల పురోగతిని సమీక్షించాలి. ప్రతి గ్రామపంచాయతీలో కనీసం 20 కూలీ ఆధారిత పనులు ఉండేలా చూడాలి. పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
4. ప్రజావాణి: స్వీకరించిన దరఖాస్తులను 30 రోజుల్లోగా పరిష్కరించాలి. లేకపోతే తిరస్కరణ కారణాలను దరఖాస్తుదారులకు తెలియజేయాలి. దరఖాస్తులను పోర్టల్‌లో నమోదు చేసి రసీదు అందజేయాలి.
5. నీట్ పరీక్ష: మే 3న నిర్వహించే నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి. పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ హాజరు, సీసీ కెమెరాలు, భద్రతా చర్యలు, వైద్య సిబ్బంది, విద్యుత్ సరఫరా, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
6. జనగణన-2027: మే 11 నుండి జూన్ 9 వరకు మొదటి విడత ఇండ్ల గణన చేపడతామని జనగణన అధికారి భారతి హోళ్ళికేరి తెలిపారు. మే 10 వరకు స్వీయ గణన కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల భాగస్వామ్యం పెంచాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



Post a Comment