దళిత, గిరిజన జర్నలిస్టుల ఆత్మగౌరవమే మా లక్ష్యం: గంగన్న
అక్రిడీటేషన్లలో వివక్షకు వ్యతిరేకంగా ఐ & పీఆర్ కార్యాలయం ముట్టడి
ఈ నెల 29న హైదరాబాద్‌లో నిరసనకు పిలుపు
తెలంగాణ డైలీ న్యూస్,కోటగిరి: తెలంగాణ రాష్ట్రంలో దళిత, గిరిజన జర్నలిస్టుల ఆత్మగౌరవమే తమ లక్ష్యమని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాదేపురం గంగన్న పేర్కొన్నారు.
కోటగిరి మండల కేంద్రంలో పాత్రికేయులతో మాట్లాడిన ఆయన, అక్రిడేషన్ కార్డుల మంజూరులో దళిత, గిరిజన జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రిడీటేషన్ కమిటీలలో ఇతర సామాజిక వర్గాల ఆధిపత్యం కొనసాగుతోందని, ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 29న ఐ&పీఆర్ కార్యాలయం ముట్టడి
ఈ డిమాండ్ల సాధన కోసం ఈనెల 29వ తేదీ సోమవారం హైదరాబాద్‌లోని ఐ & పీఆర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని గంగన్న ప్రకటించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వరకు దళిత, గిరిజన జర్నలిస్టులకు అన్యాయమే జరుగుతోందని ఆరోపించారు. 2024లో ముగిసిన అక్రిడేషన్లను సంవత్సరాల తరబడి కొనసాగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. (ప్రెస్ మీట్ వీడియో 👇)
ప్రధాన డిమాండ్లు:
1. అర్హులైన ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టులకు వెంటనే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలి.
2. అక్రిడేషన్ కమిటీలలో ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టులకు స్థానం కల్పించాలి.
3. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో దళిత, గిరిజన జర్నలిస్టులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.
4. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటున్న దళిత, గిరిజన జర్నలిస్టుల పిల్లలకు నూరుశాతం ఫీజు రాయితీ ప్రకటించాలి.
5. పెద్ద పత్రికలు, చిన్న పత్రికలు, యూట్యూబ్ ఛానళ్లు అని భేదం చూపి జర్నలిస్టుల మధ్య చిచ్చు పెట్టవద్దు.
ఈ నెల 28వ తేదీలోగా తమ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే జరిగే నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని గంగన్న హెచ్చరించారు. భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో తాము నడుస్తున్నామని, అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ముట్టడి కార్యక్రమానికి దళిత, గిరిజన జర్నలిస్టులు, దళిత, గిరిజన సంఘాలు, ప్రజాసంఘాలు, సామాజిక న్యాయవాదులు మద్దతు తెలిపి పెద్ద ఎత్తున పాల్గొనాలని అసోసియేషన్ పిలుపునిచ్చింది.
ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్టులు బేగరి రాములు, పుప్పాల సైదయ్య, రాము, మోరే జీవన్, యాదవ రావు, భీంరావు, పున్నె అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق