Poor Couple Problems | తలదాచుకునే నీడలేక వృద్ధ దంపతుల అవస్థలు

తలదాచుకునే నీడలేక వృద్ధ దంపతుల అవస్థలు  

ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వేడుకోలు  

ప్లాస్టిక్ కవర్ కిందే జీవనం సాగిస్తున్న ఎర్రపహాడ్ దంపతులు

కలెక్టర్ గారూ... ఇల్లు మంజూరు చేయగలరు...!

(తెలంగాణ డైలీ న్యూస్-కామారెడ్డి)

 కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన ఇరుమ లక్ష్మి-రాజయ్య అనే వృద్ధ దంపతులు తలదాచుకునేందుకు నీడ లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. మూడు కర్రల మధ్య కట్టిన ప్లాస్టిక్ తాటిపత్రి కిందే వీరి జీవనం సాగుతోంది. 

ఒకవైపు కడు పేదరికం, మరోవైపు రోగాలతో వృద్ధాప్యం వెంటాడుతున్నా కనీసం ఒక చిన్న గూడు కూడా లేక ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. వయస్సు పైబడటంతో కూలి పనులు చేసే ఓపిక లేదు. వీరికి తోడుగా ఒక మనవరాలు ఉంది. ఆ పాప బాధ్యత కూడా ఈ వృద్ధులపైనే ఉంది.

గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనమే ఈ వృద్ధ దంపతులకు ఆకలి తీరుస్తోంది. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ఆ బడి ఆవరణను ఊడుస్తూ కాలం గడుపుతున్నారు. 

సొంతంగా చిన్న గూడు కట్టుకునే స్థోమత లేక ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తే వచ్చే డబ్బులతో ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఒక్క గదైనా కట్టించి ఇస్తారేమోనని ఆశపడుతున్నారు. కామారెడ్డి కలెక్టర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే స్పందించి తమకు ఇల్లు మంజూరు చేయాలని వారు వేడుకుంటున్నారు.

"ఈ తాటిపత్రి నరకం నుంచి బయటపడి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవాలని ఉంది. ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలి" అంటూ ఆ వృద్ధ దంపతులు కన్నీళ్లతో వేడుకుంటున్నారు.

Post a Comment

Previous Post Next Post