రేపటి నుంచి టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక స్కూల్ బస్సులు
విద్యార్థుల వేళలకు అనుగుణంగా అన్ని రూట్లలో బస్సులు నడపాలి: ఎండీ నాగిరెడ్డి
227 పనిదినాలకు సరిపడా రవాణా ఏర్పాట్లు సిద్ధం
తెలంగాణ డైలీ న్యూస్ బ్యూరో, హైదరాబాద్, జూన్ 14: వేసవి సెలవుల అనంతరం రేపు జూన్ 15 సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 2026-27 విద్యాసంవత్సరానికి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక స్కూల్ బస్సులను సిద్ధం చేసింది.
అన్ని రూట్లలో తగినన్ని బస్సులు నడపాలి: ఎండీ
విద్యార్థులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా అన్ని రూట్లలో తగినన్ని స్కూల్ బస్సులను నడపాలని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి అన్ని రీజియన్ల అధికారులను ఆదేశించారు.
227 పనిదినాలకు రవాణా సౌకర్యాలు
నూతన విద్యాసంవత్సరంలో మొత్తం 227 పనిదినాలు ఉన్నందున విద్యార్థులు సకాలంలో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా రవాణా సౌకర్యాలను సిద్ధం చేశామని ఎండీ పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు ఆదేశం
రాష్ట్రంలోని అన్ని రీజియన్ల అధికారులు, డిపో మేనేజర్లు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి రవాణా ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల స్కూల్ టైమింగ్స్‌కు అనుగుణంగా బస్సు సర్వీసులను క్రమబద్ధీకరించాలన్నారు.
పాత స్కూల్ రూట్లు పునరుద్ధరణ
గతంలో నడిపిన అన్ని స్కూల్ రూట్లను విధిగా పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. విద్యార్థులు బస్సుల కోసం ఎక్కువ సమయం వేచి ఉండకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో ఖచ్చితమైన సమయ పాలన పాటించాలని, అవసరమైన చోట అదనపు ట్రిప్పులు నడపాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు.


Post a Comment