38 మందికి కోర్టులో జరిమానా రూ.43,500
5 మందికి ఒక రోజు జైలు శిక్ష
కామారెడ్డి: రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాల రక్షణ లక్ష్యంగా కామారెడ్డి జిల్లా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.
జిల్లా వ్యాప్తంగా జరిపిన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 38 మందిని గుర్తించి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి మొత్తం రూ.43,500 జరిమానా విధించింది. అదేవిధంగా 5 మందికి ఒక రోజు జైలు శిక్ష విధించింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడపడం చట్ట ఉల్లంఘన మాత్రమే కాదు, ఒక కుటుంబం జీవితాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టే ప్రమాదకరమైన చర్య అని అన్నారు. క్షణిక ఆనందం కోసం తీసుకునే నిర్లక్ష్య నిర్ణయం జీవితాంతం పశ్చాత్తాపానికి కారణమవుతుందని, మీ ప్రాణాలతో పాటు రోడ్డుపై ప్రయాణించే అమాయకుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టవద్దని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ను కామారెడ్డి జిల్లా పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచి జరిమానాలు, జైలు శిక్షలు సహా చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని స్పష్టం చేశారు.
జిల్లా పోలీసుల విజ్ఞప్తి
మద్యం సేవించి వాహనాలు నడపవద్దు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు ప్రయాణికులు సీటుబెల్ట్ ధరించాలి. మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని కోరారు.
ప్రజల భద్రతే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలను నిరంతరం కొనసాగిస్తామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసులు తెలిపారు.
====================
వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
ప్రజలకు భరోసా, విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశం
గణేష్ ఉత్సవాలకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి
కామారెడ్డి: జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు.
యెల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, సీఐ సంతోష్ కుమార్, తాడ్వాయి ఎస్‌హెచ్‌ఓ నరేష్ ఎస్పీకి స్వాగతం పలికారు. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఎస్పీ యూనిఫాం టర్నౌట్‌ను పరిశీలించి, సిబ్బందితో సమావేశమై విధి నిర్వహణ, క్రమశిక్షణ, ప్రజాసేవలపై సమీక్ష నిర్వహించారు.
స్టేషన్ పరిశీలన
రిసెప్షన్, లాకప్, బ్యారెక్స్, టెక్నికల్ రూమ్, రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు, సీజ్ చేసిన వాహనాలు, స్టేషన్ భౌగోళిక మ్యాప్, క్రైమ్ హాట్‌స్పాట్స్ తదితర అంశాలను పరిశీలించారు. పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిపై ఎస్‌హెచ్‌ఓను అడిగి తెలుసుకుని సూచనలు చేశారు.
CCTNS ఆన్‌లైన్ వ్యవస్థ పనితీరు, ఫిర్యాదుదారులను స్వీకరించే విధానం, రిజిస్టర్ల నిర్వహణను తనిఖీ చేశారు. ప్రతి పిటిషన్‌ను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎస్పీ కీలక సూచనలు
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజల్లో పోలీసులపై విశ్వాసం, భద్రత, భరోసా పెంపొందేలా పనిచేయాలని సూచించారు.విజిబుల్ పోలీసింగ్, నిరంతర పెట్రోలింగ్ ద్వారా శాంతిభద్రతలను బలోపేతం చేయాలి. పాత నేరస్తులు, సస్పెక్ట్ వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచి ముందస్తు నేర నివారణ చర్యలు చేపట్టాలన్నారు. మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన, యువతలో చట్టాలపై అవగాహన కార్యక్రమాలను గ్రామాల్లో నిర్వహించాలని ఆదేశించారు. ప్రధాన రహదారులపై ప్రమాద హాట్‌స్పాట్లను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, డ్రంక్ అండ్ డ్రైవ్, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
గణేష్ ఉత్సవాలపై ప్రత్యేక దృష్టి
గణేష్ ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నిర్వహణ, గణేష్ మండపాల వద్ద భద్రత, నిర్వాహక కమిటీలతో సమన్వయం వంటి ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో యెల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, సీఐ సంతోష్ కుమార్, తాడ్వాయి ఎస్‌హెచ్‌ఓ నరేష్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




Post a Comment