ఇద్దరు నర్సులు సస్పెండ్, అనస్థీషియా డాక్టర్ విధుల నుంచి తొలగింపు
ప్రభుత్వం సీరియస్ - విచారణలో తేలిన నిర్లక్ష్యం
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో జరిగిన నిర్లక్ష్యం వల్లే ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురయ్యారని ఉన్నత అధికారుల విచారణలో తేలింది.
గత 15 రోజుల క్రితం శుక్ర, శనివారాల్లో చేసిన 10 సిజెరియన్లలో 5గురు బాలింతలు ఆపరేషన్ అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టగా, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే ప్రధాన కారణమని నిర్ధారించారు. విచారణ నివేదిక ప్రకారం శస్త్రచికిత్సా పరికరాలు, లినెన్ సరైన స్టెరిలైజేషన్ లేకపోవడం వల్ల కాలుష్యం జరిగే అధిక సంభావ్యత ఉందని, సెప్సిస్‌కు ఇదే ప్రధాన కారణమని స్పష్టమవుతోందని విచారణ లో తేలింది. ఆపరేషన్ థియేటర్లలో, శస్త్రచికిత్సలలో ఉపయోగించే వస్తువులలో కఠినమైన సెప్టిక్ పరిస్థితులను పాటించడంలో జరిగిన లోపం వల్ల 10వ, 11వ జూలై 2026న ఈ సంఘటనలు జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు.దీంతో వెంటనే కఠిన చర్యలు తీసుకున్నారు.
చర్యలు ఇవే:
1. మాతా శిశు ఆసుపత్రిలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న ఇద్దరు స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేశారు. వీరిది పిట్లం మండలం.
2. ఆపరేషన్‌కు మత్తు మందు ఇచ్చిన అనస్థీషియా వైద్యుడిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఐదుగురికీ నిమ్స్‌లో చికిత్స
సిజెరియన్ చేసుకున్న హుమేరా ఫాతిమా, రుక్సానా, జ్యోతి, లక్ష్మి ప్రియ, సునీతలను నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తు ఆదేశాలతో ఐదుగురికీ ఒకే చోట మెరుగైన చికిత్స అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అందరూ నిమ్స్ ICUలో డయాలసిస్‌తో పాటు ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య వివరాలు తెలుసుకుంటున్నారు. రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా అధికారులతో మాట్లాడి సూచనలు ఇస్తున్నారు.
నిమ్స్ ప్రొఫెసర్లతో విచారణ
ఒకేసారి 5గురు బాలింతలు ఒకేలాంటి లక్షణాలతో అస్వస్థతకు గురవడంపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. కారణాలు కనుగొనేందుకు నిమ్స్‌కు చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు, డైరెక్టర్‌ను ప్రిన్సిపల్ సెక్రటరీ బాన్సువాడకు పంపారు. వారు ఆపరేషన్ థియేటర్, వాడిన పరికరాలు, మందులు, శస్త్రచికిత్స విధానాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బందిని విచారించారు. కొన్ని మందులు, పరికరాల శాంపిల్స్‌ను ల్యాబ్ టెస్టుల కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. చివరికి ఆసుపత్రి నర్సులు, మత్తు మందు వైద్యుడి నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని తేలింది.
DME విచారణలో నిర్లక్ష్యం అని తేలింది : డాక్టర్ శ్రీనివాస్
ఈ ఘటనపై తెలంగాణ డైలీ న్యూస్ తో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీనివాస్ మాట్లాడుతూ, "బాలింతలు తీవ్ర అస్వస్తత కు గురైన ఘటన లో ఐదుగురూ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఉన్నతాధికారుల విచారణలో నిర్లక్ష్యం తేలడంతో ఇద్దరు నర్సులు, ఒక అనస్థీషియా డాక్టర్‌పై చర్యలు తీసుకున్నారు" అని తెలిపారు.
ప్రభుత్వం ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం గమనార్హం.
ఆసుపత్రి ప్రతిష్టకు దెబ్బ
జాతీయ, రాష్ట్రస్థాయి కాయకల్ప అవార్డులు పొందిన బాన్సువాడ ఏరియా ఆసుపత్రి చరిత్రలో ఇలాంటి ఘటన ఇదే మొదటిసారి. బాన్సువాడతో పాటు ఎల్లారెడ్డి, జుక్కల్, నారాయణఖేడ్, బోధన్ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా రోగులు ఇక్కడికి వస్తుంటారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంశమైంది. మాజీ మంత్రి హరీష్ రావు నిమ్స్ కు వెళ్లి పరామర్శించిన విషయం తెలిసిందే.
సస్పెన్షన్ ఉత్తర్వుల ప్రతి 👇👇



إرسال تعليق