రామారెడ్డి పోలీసుల చాకచక్యం - ఇద్దరు నిందితుల అరెస్ట్, రూ.15 వేలు స్వాధీనం
కామారెడ్డి: వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్ గేమింగ్ లింకులు పంపి "పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు" అని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను రామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, కేసు వివరాలు వెల్లడించారు. వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్ గేమింగ్ లింకులు పంపుతూ అమాయక ప్రజల నుంచి పెట్టుబడుల పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారనే సమాచారంతో రామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎలా పట్టుకున్నారు ?
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ ఆధ్వర్యంలో కామారెడ్డి రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రామన్, రామారెడ్డి ఎస్‌ఐ మురళి నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో కామారెడ్డి బస్టాండ్ వద్ద విశాఖపట్నం వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
మోసం ఇలా ....
విచారణలో ప్రధాన నిందితుడు భూక్య నవీన్ @ నరేష్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో http://Future9.com అనే ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్ డేటా, మొబైల్ నంబర్లు సేకరించినట్లు తెలిపాడు. భారత్‌కు వచ్చిన తర్వాత వాట్సాప్ ద్వారా పలువురికి లింకులు పంపి, యూజర్ ఐడీలు సృష్టించి పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించేవారు.
వెబ్‌సైట్‌లో నేరుగా చెల్లింపు జరగని పక్షంలో తమ యూపీఐ QR కోడ్ ద్వారా నగదు తీసుకుని సదరు వెబ్‌సైట్‌లో జమ చేసేవారు. దీనికి 5 శాతం కమిషన్ తీసుకునేవారు. ఈ వెబ్‌సైట్ ద్వారా దేశవ్యాప్తంగా పలువురు బాధితులు మోసపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
నిందితులు - స్వాధీనం
నిందితులు:
1. భూక్యా నవీన్ @ నరేష్ 26 సం, రామారెడ్డి మండలం
2. భూక్యా ప్రవీణ్ 23 సం, రామారెడ్డి మండలం
స్వాధీనం చేసుకున్నవి: HP ల్యాప్‌టాప్-1, మొబైల్ ఫోన్లు-4, నగదు రూ.15,000
ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
ఎస్పీ హెచ్చరిక
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ, ఆన్‌లైన్ గేమింగ్, పెట్టుబడులు, ట్రేడింగ్, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, క్యాష్‌బ్యాక్, రెట్టింపు లాభాల పేరుతో వాట్సాప్, టెలిగ్రామ్‌లో వచ్చే గుర్తుతెలియని లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సూచించారు. తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పే వెబ్‌సైట్లు, యాప్‌లను గుడ్డిగా నమ్మి నగదు పంపవద్దని కోరారు.
ఆన్‌లైన్ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు ఫోన్ చేయాలని లేదా http://www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని, సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే బాధితుల నగదును హోల్డ్ పెట్టే అవకాశం ఉంటుందని తెలిపారు.
నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రామన్, రామారెడ్డి ఎస్‌ఐ మురళి, సైబర్ క్రైమ్ ఎస్‌ఐ నరేష్ మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.


إرسال تعليق