Top News

Operation Kavach One Year Completed |ఆపరేషన్ కవచ్ విజయవంతంగా ఏడాది పూర్తి


  • ఆపరేషన్ కవచ్ విజయవంతంగా ఏడాది పూర్తి  
  • ప్రజలకు రక్షణ కవచంగా నిలిచిన కామారెడ్డి పోలీసులు  
  • ఎస్పీ రాజేష్ చంద్ర దిశానిర్దేశంలో ప్రీవెంటివ్ పోలీసింగ్‌కు నిదర్శనం
  • ఆపరేషన్ కవచ్ లో సాధించిన విజయాలను వెల్లడించిన ఎస్పీ 
కామారెడ్డి: రాత్రి వేళల్లో ప్రజలు హాయిగా నిద్రపోయేందుకు కామారెడ్డి జిల్లా పోలీసులు ప్రారంభించిన ఆపరేషన్ కవచ్ విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర, దిశానిర్దేశంలో 25 జులై 2025న ప్రారంభమైన ఈ ప్రీవెంటివ్ పోలీసింగ్ వ్యూహం 24 జులై 2026 నాటికి ఏడాది పూర్తి చేసుకుంది. 
వర్షం, చలిని లెక్కచేయకుండా రోడ్లపై పహారా కాస్తూ నేరాలను కట్టడి చేసిన ఈ ఆపరేషన్, నేరగాళ్లకు భయం పుట్టిస్తూనే సామాన్య ప్రజలకు భరోసా కల్పించింది. ఈ సందర్బంగా ఎస్పీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏడాదిలో సాధించిన విజయాలను మీడియా కు వివరించారు.


ఏడాదిలో సాధించిన ప్రధాన విజయాలు:
గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం:  
ఈ ఏడాదిలో 6 NDPS కేసులు నమోదు చేశారు. 18 మందిని అరెస్టు చేసి సుమారు 403.405 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 2.01 కోట్ల రూపాయలు.  
ఒడిశా నుండి నాసిక్‌కు పనసపండ్ల మాటున తరలిస్తున్న 387.128 కిలోల గంజాయిని NH-44 పై క్యాసంపల్లి వద్ద పట్టుకున్నారు. దీని విలువ 1.93 కోట్ల రూపాయలు. నర్సన్నపల్లి చౌరస్తా వద్ద ఆటోలో దాచిన గంజాయితో ముగ్గురిని అరెస్టు చేశారు.
అక్రమ రవాణా అరికట్టడం:  
11 అక్రమ ఇసుక రవాణా కేసుల్లో 8 లారీలు, 3 ట్రాక్టర్లు స్వాధీనం. 
3 అక్రమ పశువుల రవాణా కేసులు, 3 పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కేసులు నమోదు. 
1 గుట్కా రవాణా కేసులో 43 లక్షల నగదు స్వాధీనం.
దొంగతనాలు, ఆయుధాల రికవరీ:  
18 దొంగిలించిన మోటార్ సైకిళ్లు, 5 దేశీయ తుపాకులు, 1 ఎయిర్ గన్ స్వాధీనం. 
ఆలయ దొంగతనాలు, ఏటీఎం దొంగతనం కేసులను ఛేదించి అంతర్‌రాష్ట్ర నేర ముఠాలను అరెస్టు చేశారు. అంతర్‌రాష్ట్ర నేర ముఠాల కార్యకలాపాలు 12 నుండి 2కి తగ్గాయి. 5 మంది అంతర్‌జిల్లా నేరస్థులను గుర్తించారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్:  
ఏడాదిలో 5,16,984 వాహనాలను తనిఖీ చేశారు. 
1,19,052 మందిని పాపిలాన్ పరికరంతో పరిశీలించారు. 
209 మంది అనుమానితులను గుర్తించారు. 
3,572 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.
ప్రజల ప్రశంసలు పొందిన ఘటనలు
యజమానికి తెలియక ముందే ట్రాక్టర్ రికవరీ:  
రామారెడ్డి మండలం పోసానిపేటకు చెందిన రైతు బండి పెంటయ్య ట్రాక్టర్ దొంగతనానికి గురైంది. సదాశివనగర్ పద్మజీవాడి వద్ద తనిఖీల్లో ఉన్న గాంధారి ఎస్సై బి. ఆంజనేయులు, సిబ్బంది 2 గంటల్లోనే 5 లక్షల విలువైన ట్రాక్టర్‌ను రికవరీ చేసి యజమానికి అప్పగించారు.
ప్రజల సహకారంతో మిడ్‌నైట్ చేజింగ్:  
నాగిరెడ్డిపేట్ పరిధిలో ఆటో దొంగిలించిన 4 మంది దొంగలను 8 కి.మీ మేర వెంబడించి పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో మాల్తుమ్మెద, పోచారం, జక్కన్నపేట గ్రామస్తులు టార్చ్‌లతో పోలీసులకు సహకరించారు. 43 కేసుల హిస్టరీ ఉన్న చింతా బలరాజ్‌తో పాటు నలుగురిని అరెస్టు చేశారు.
దేవాలయ చోరీ ఛేదన:  
సదాశివనగర్ ఎల్లమ్మ గుడిలో చోరీ జరిగిన కొన్ని గంటల్లోనే నిందితులను పట్టుకుని వెండి కండ్లు, హుండీ నగదు రికవరీ చేశారు.
అడవి జంతువుల వేటగాళ్ల ముఠా అరెస్టు:  
గాంధారి పోలీసులు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస రావు పర్యవేక్షణలో 8 మంది వేటగాళ్లను పట్టుకుని 5 నాటు తుపాకులు, 1 ఎయిర్ గన్ స్వాధీనం చేసుకున్నారు.
మానవీయ స్పందన:  
తల్లి మందలించడంతో నిజామాబాద్ నుండి సైకిల్‌పై వచ్చిన 14 ఏళ్ల బాలుడిని టేక్రియాల్ వద్ద గుర్తించి, అన్నం పెట్టి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
రహదారి భద్రత:  
భిక్నూర్ టోల్‌ప్లాజా వద్ద ఒకే డ్రైవ్‌లో 1,139 వాహనాలు తనిఖీ చేశారు. మద్యం మత్తులో ఉన్న బస్సు డ్రైవర్లను పట్టుకుని 45 మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. ఒక రాత్రిలో 27 మంది మద్యం తాగి డ్రైవ్ చేసిన వారిపై కేసులు నమోదు చేశారు.
ఎస్పీ సందేశం
ఈ సందర్భంగా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ, రాత్రి వేళల్లో చేసే తనిఖీలు ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదని, నేరస్థులను పట్టుకోవడానికే అని తెలిపారు. యువతను చెడు మార్గాల నుండి కాపాడటం తమ బాధ్యత అన్నారు. పోలీసులు రాత్రంతా మేల్కొని ఉండేది ప్రజల ప్రశాంత నిద్ర కోసమే అని, మీ భద్రత మా బాధ్యత అని స్పష్టం చేశారు.
ఈ ఆపరేషన్లలో ప్రత్యేకంగా పనిచేసిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ నగదు పురస్కారాలతో సత్కరించారు. ఆపరేషన్ కవచ్ అనేది కేవలం తనిఖీ కార్యక్రమం కాదు, కామారెడ్డి జిల్లా ప్రజలకు అభేద్యమైన రక్షణ కవచమని పోలీస్ శాఖ పేర్కొంది.

Post a Comment

أحدث أقدم