Top News

Police Alert | వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు

వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు  

ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు

జిల్లా వ్యాప్తంగా వాగులు, వంతెనల పర్యవేక్షణ

కామారెడ్డి: జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జిల్లా  యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు 24 గంటలు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.వాగులు, వంతెనలు, లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారుల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నారు.

ప్రత్యేక పర్యవేక్షణ ప్రాంతాలు

పాల్వంచ: మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాల్వంచ వంతెన సమీపంలో పాత, వినియోగంలో లేని రహదారిపై నీటి ప్రవాహం ఉండటంతో ప్రజలు అక్కడికి వెళ్లకుండా గ్రామపంచాయతీ ట్రాక్టర్లను ఇరువైపులా ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. అక్కడ పోలీసు సిబ్బందిని నియమించి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

లోట్టి వాగు: ఫరీద్‌పేట్–వాడి గ్రామాల మధ్య ఉన్న లోట్టి వాగు వద్ద నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉన్న అడ్డంకులను జేసీబీ సహాయంతో తొలగించి, నీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకున్నారు.

గొల్లపల్లి గంగమ్మ వాగు: రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి గంగమ్మ వాగు వద్ద ప్రస్తుతం నీటి ప్రవాహం సాధారణంగా ఉన్నప్పటికీ, ముందుజాగ్రత్తగా ఒక పోలీసు సిబ్బందిని విధుల్లో ఉంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

లింగంపేట్: లింగంపేట్ గ్రామ సమీపంలోని కరీంనగర్–కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై భారీ మర్రిచెట్టు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు జేసీబీ సహాయంతో చెట్టును తొలగించి రహదారిని పూర్తిగా క్లియర్ చేసి వాహన రాకపోకలను పునరుద్ధరించారు.

ఎస్పీ సూచనలు

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ, వర్షాల సమయంలో ప్రజలు వాగులు, వంతెనలు, ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయవద్దని, సెల్ఫీల కోసం ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలను ప్రమాదంలో పడవేయవద్దని సూచించారు.

ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే డయల్-100కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 24 గంటలూ అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ, ప్రజల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నారని తెలిపారు.









Post a Comment

أحدث أقدم