బాన్సువాడ నియోజకవర్గంలో ఆషాఢ బోనాల సంబరాలు
ఆలయాల్లో బోనం ఎత్తిన పోచారం శ్రీనివాసరెడ్డి
బాన్సువాడ: ఆషాఢ మాసం సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి వివిధ ఆలయాల్లో పూజలు నిర్వహించి బోనం సమర్పించారు.వారితో పాటు రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
వివిధ ఆలయాల్లో పూజలు
శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి తొలుత బాన్సువాడ పట్టణ కేంద్రంలోని కోటగల్లి కోటదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయికృప నగర్ ఫేస్ 2 కాలనీలోని మైసమ్మ ఆలయం, రుద్రూర్ గ్రామంలోని పోచమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాలను సందర్శించి బోనం ఎత్తారు.ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజల సంక్షేమం, సుభిక్షం కోసం ప్రార్థనలు చేశారు.
భారీగా పాల్గొన్న భక్తులు
బోనాల ఉత్సవాల్లో బాన్సువాడ నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవార్లకు నివేదనలు సమర్పించారు. డప్పు చప్పుళ్లు, పాటలతో ఆలయ ప్రాంగణాలు భక్తి శ్రద్ధలతో నిండిపోయాయి.
ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించే బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని పోచారం శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు.








إرسال تعليق