ఎస్సీ, ఎస్టీ బాధితులకు తక్షణ సహాయం అందించాలి
ప్రతి నెలా సివిల్ రైట్స్ డే నిర్వహించాలని కలెక్టర్ ఆదేశం
జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం
కామారెడ్డి: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసుల్లో బాధితులకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఎలాంటి జాప్యం లేకుండా పరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులు, నమోదైన అట్రాసిటీ కేసులు, దర్యాప్తు పురోగతి, బాధితులకు అందుతున్న పరిహారం తదితర అంశాలను కలెక్టర్ సమీక్షించారు.
నెలకు ఒకసారి సివిల్ రైట్స్ డే
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజల్లో హక్కులపై అవగాహన పెంచడానికి, వారి సమస్యలను వెంటనే పరిష్కరించడానికి ప్రతి నెలా సివిల్ రైట్స్ డే నిర్వహించాలని సూచించారు. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం జరిగేలా పోలీసు, రెవెన్యూ, సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
పరిహారం, ఇతర సహాయాల్లో జాప్యం వద్దు
బాధితులకు అందాల్సిన పరిహారం మరియు ఇతర సహాయాలను వెంటనే అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కేసుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, బాధితులకు అవసరమైన అండగా నిలవాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఎన్.వై. గిరి, డిప్యూటీ కలెక్టర్ రవి తేజ, జెడ్పీ సీఈవో చందర్ నాయక్, బాన్సువాడ డీఎస్పీ, ఎల్లారెడ్డి డీఎస్పీ, డీసీఆర్‌బీ డీఎస్పీ కామారెడ్డి, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి పి. వెంకటేష్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, ఉద్యానవన శాఖ అధికారి, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ అధికార, అనధికార సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق