రైతుబంధు ఆగమైంది, రైతుబీమా గల్లంతైంది - మాజీ మంత్రి హరీష్ రావు
14 ఆగస్టు నుంచి రైతుబీమా బంద్, ఎరువుల కోసం క్యూలైన్లు - కాంగ్రెస్ సర్కార్ పై ఫైర్
మళ్లీ కేసీఆర్ వస్తేనే రైతులకు మంచి భవిష్యత్తు - రాంపూర్ హనుమాన్ గుడి ప్రతిష్టలో హరీష్ రావు
సిద్దిపేట, ఆగస్టు 31(తెలంగాణ డైలీ న్యూస్):
సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ దేవాలయ ప్రతిష్టా కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
రాంపూర్ గ్రామ పెద్దలు గుడికి లక్ష విరాళం ఇవ్వగా, బీఆర్ఎస్ హయాంలో 10 లక్షలు మంజూరు చేశామని, ప్రభుత్వం మారడంతో బిల్లులు ఆగి పనులు ఆలస్యమయ్యాయని అన్నారు. ఆగిన నిధులను తాను దగ్గరుండి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ హయాంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ఎరువులు ఆటోలో నేరుగా బోరు కాడికి వచ్చేవని, ఇప్పుడు యూరియా, డీఏపీ కోసం 15 రోజులు క్యూలైన్లలో నిలబడాల్సిన దుస్థితి వచ్చిందని అన్నారు. రైతుబంధు ఒకరికి ఇచ్చి ఒకరికి ఎగబెడుతున్నారని, రైతుబీమాను ఆగస్టు 14 నుంచి పూర్తిగా బంద్ పెట్టారని ఆరోపించారు. తమ గ్రామంలోనే ఐదుగురికి రైతుబీమా అందిందని గుర్తు చేశారు.
కేసీఆర్ 57 ఏళ్లకే పెన్షన్లు, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చారని, కాంగ్రెస్ మూడేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదని, రూ.4 వేల పెన్షన్, మహిళలకు రూ.2500 హామీలు వంద రోజులు పోయి వెయ్యి రోజులైనా అమలు కాలేదని విమర్శించారు. కేసీఆర్ కిట్ బంద్ చేశారని, తులం బంగారం ఇస్తామని మోసం చేశారని, కళ్యాణ లక్ష్మి చెక్కు పిల్లలు పుట్టాక ఇస్తున్నారని అన్నారు.
రాష్ట్రం మళ్లీ బాగుపడాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, అప్పుడే ప్రజల కష్టాలు తీరుతాయని హరీష్ రావు అన్నారు.





إرسال تعليق