Top News

Life imprisonment | హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు

హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు, రూ.2,000/- జరిమానా  

10 ఏళ్ల పాత ఆస్తి కక్షతో జరిగిన హత్య కేసు రుజువు  

సాక్ష్యాధారాలతో నేరాన్ని నిరూపించిన బీర్కూర్ పోలీసులు  

దర్యాప్తు బృందాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి : 

2018 సెప్టెంబర్ 2న బీర్కూర్ మండలం బరంగెడ్గి గ్రామానికి చెందిన వడ్ల మారుతి హత్యకు గురైన కేసులో గౌరవ జిల్లా న్యాయమూర్తి  శ్రీమతి పి. ముక్తిద  కీలక తీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందితులు A1) వడ్ల గజానంద్, వయసు 27, A2) వడ్ల సాయిలు, వయసు 50, ఇద్దరికీ జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.2,000/- జరిమానా విధించారు.

ఫిర్యాదుదారుడు వడ్ల రాజ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, మృతుడు వడ్ల మారుతి, నిందితుడు వడ్ల సాయిలు స్వయానా అన్నదమ్ములు. పదేళ్లుగా కుటుంబంలో ఆస్తి, భూమి వివాదాలు కొనసాగుతున్నాయి. మృతుడు తన పేరిట 3 ఎకరాలు, నిందితుడి పేరిట 2 ఎకరాలు పట్టా చేయించుకున్నారు. అదనంగా రావాల్సిన అర ఎకరం ఇవ్వకపోవడంతో ఇరువురి మధ్య గొడవలు జరిగాయి. ఒకసారి కేసు కూడా నమోదై, రాజీలో భూమి ఇస్తానని మృతుడు చెప్పినా తర్వాత ఇవ్వకపోవడంతో పాత కక్ష కొనసాగింది.

ఈ కక్షతోనే నిందితుడు వడ్ల సాయిలు తన అన్న వడ్ల మారుతిని మృదంగం మరమ్మతుల పేరుతో ఇంటికి పిలిపించి, తన కుమారుడు వడ్ల గజానంద్తో కలిసి వడ్రంగి బాడిషతో తలపై దాడి చేసి హత్య చేశారు. తీవ్ర గాయాలతో 108 అంబులెన్స్‌లో బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

బీర్కూర్ పోలీసులు ఈ కేసులో సాక్షులను విచారించి, శాస్త్రీయ మరియు ఇతర పక్కా సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. న్యాయస్థానం సాక్షుల వాంగ్మూలాలు, సాక్ష్యాధారాల ఆధారంగా నేరం రుజువైనట్లు నిర్ధారించి శిక్ష విధించింది.

ఈ కేసులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్  సూర్య ప్రసాద్, దర్యాప్తు చేసిన అప్పటి బీర్కూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రావు, ఎస్‌ఐ ఎం. సంపత్, ప్రస్తుత సీఐ తిరుపయ్య, ఎస్‌ఐ రాములు, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్‌ఐ రామేశ్వర్ రెడ్డి, సీడీవో మోహన్ సింగ్ nu  జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర అభినందించారు.

"జిల్లాలో నేరాలకు పాల్పడిన వారికి జైలు శిక్ష తప్పదు. కఠిన శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుంది" అని జిల్లా ఎస్పీ తెలిపారు.

Post a Comment

أحدث أقدم