Top News

Operation Muskaan | 'ఆపరేషన్ ముస్కాన్–XII' విజయవంతం

'ఆపరేషన్ ముస్కాన్–XII' విజయవంతం  

45 మంది బాలలను గుర్తించి రక్షించిన జిల్లా యంత్రాంగం

కామారెడ్డి డివిజన్‌లో 11, ఎల్లారెడ్డి డివిజన్‌లో 4, బాన్సువాడ డివిజన్‌లో 8 కేసులు 

కామారెడ్డి: బాలల హక్కుల పరిరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన "ఆపరేషన్ ముస్కాన్–XII" కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లాలో విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర తెలిపారు.

2026 జూలై 1 నుండి జూలై 31 వరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో కార్మిక శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ తదితర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్ల పరిధిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టి మొత్తం 45 మంది బాలబాలికలను గుర్తించి రక్షించారు. వీరిలో 41 మంది బాలురు, 4 మంది బాలికలు ఉన్నారు. సబ్ డివిజన్ వారీగా కామారెడ్డిలో 13 మంది, ఎల్లారెడ్డిలో 10 మంది, బాన్సువాడలో 22 మంది బాలలను గుర్తించారు.

బాలలను చట్టవిరుద్ధంగా పనిలో పెట్టుకున్న యజమానులపై మొత్తం 23 కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. డివిజన్ వారీగా కామారెడ్డి డివిజన్‌లో 11, ఎల్లారెడ్డి డివిజన్‌లో 4, బాన్సువాడ డివిజన్‌లో 8 కేసులు నమోదయ్యాయి.

రక్షించిన బాలలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మార్గదర్శకాల మేరకు తల్లిదండ్రులకు అప్పగించడం, అవసరమైన వారికి సంరక్షణ, పునరావాసం కల్పించడం, విద్యాభ్యాసం కొనసాగించేలా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ వివరించారు. తప్పిపోయిన పిల్లల వివరాలను "ట్రాక్ చైల్డ్" పోర్టల్‌లో నమోదు చేసి వారి ఆచూకీ కోసం నిరంతరం చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, 18 సంవత్సరాల లోపు పిల్లలను హోటళ్లు, మెకానిక్ షాపులు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు, వ్యవసాయ క్షేత్రాలు తదితర ప్రాంతాల్లో పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

బాలల రక్షణ ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు, తప్పిపోయిన పిల్లలు లేదా బాలలపై వేధింపులు కనిపిస్తే చైల్డ్ హెల్ప్‌లైన్–1098 లేదా డయల్–100కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.




Post a Comment

أحدث أقدم