మండపాల వద్ద CCTV తప్పనిసరి, డీజేలకు అనుమతి లేదు - భద్రతపై కీలక ఆదేశాలు
విగ్రహాల రవాణాలో విద్యుత్ తీగలపై అప్రమత్తంగా ఉండాలి - గతేడాది విషాదం పునరావృతం కావొద్దు
కామారెడ్డి, ఆగస్టు 31: గణేష్ నవరాత్రి ఉత్సవాలను సురక్షితంగా, ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుందామని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర పిలుపునిచ్చారు.
కామారెడ్డి కళాభారతి ప్రాంగణంలో గణేష్ ఉత్సవాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీలు మధుసూదన్, శ్రీనివాస్ రావు, విఠల్ రెడ్డి, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.
ఎస్పీ సూచనలు:
గతేడాది విషాదం పునరావృతం కావొద్దు: గతేడాది మాచారెడ్డి మండలంలో విగ్రహ తరలింపు సమయంలో విద్యుత్ తీగలు తగిలి ఒకరు మృతి చెందగా, ఇంద్రానగర్ లో ముగ్గురు గాయపడ్డారని గుర్తు చేశారు. ఈ ఏడాది ఒక్క ప్రాణం కూడా పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
మండపాల భద్రత నిర్వాహకులదే: ప్రజా రవాణాకు, అత్యవసర వాహనాలకు ఇబ్బంది లేకుండా మండపాలు ఏర్పాటు చేయాలి. దొంగతనాల నివారణకు CCTV తప్పనిసరి, రాత్రివేళ కాపలా ఉండాలి. ప్రతి మండపం వద్ద పోలీస్ పాయింట్ బుక్ ఉంటుందన్నారు.
విగ్రహాల రవాణాలో అప్రమత్తత: విగ్రహం ఎత్తు, వాహనం ఎత్తు, రహదారిపై విద్యుత్ తీగలను ముందే పరిశీలించాలి. వేగం కంటే భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
విద్యుత్, అగ్ని ప్రమాదాలకు చెక్: వర్షాకాలం దృష్ట్యా విద్యుత్ వైర్లు, సౌండ్ సిస్టంలను నిపుణులతో ఏర్పాటు చేయించుకోవాలి. దీపాలు, ప్రమిదల వద్ద మండే వస్తువులు ఉంచొద్దు. ఫైర్ ఎక్స్టింగ్విషర్, నీటి బకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి.
డీజేలకు నో, వదంతులకు దూరం: డీజేలు, అనవసర ఆర్భాటాలకు దూరంగా ఉండాలి. మండపాల వద్ద మద్యం, పేకాట, అసభ్య కార్యక్రమాలకు తావులేదు. సోషల్ మీడియాలో వచ్చే రెచ్చగొట్టే సందేశాలు, వదంతులను నమ్మవద్దు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.
"ఈ సంవత్సరం మన పండుగలో ఆనందమే ఉండాలి.. విషాదానికి చోటు ఉండకూడదు. భక్తి మన బలం.. భద్రత మన బాధ్యత" అని ఎస్పీ రాజేష్ చంద్ర పిలుపునిచ్చారు.






إرسال تعليق