ప్రత్యేక బోన్లు, వలతో పట్టి అడవికి తరలింపు
మున్సిపల్ చైర్ పర్సన్ ఆదేశాల మేరకు చర్యలు
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
బాన్సువాడ: పట్టణంలో పెరిగిపోతున్న వీధి కుక్కల బెడదకు మున్సిపాలిటీ చర్యలు చేపట్టింది. ఇటీవల కుక్కల దాడిలో 12 మంది చిన్నారులు గాయపడి ఆసుపత్రుల పాలైన విషయం విదితమే. దీంతో బీఆరెస్ తో నాయకులు, బాధితులతో కలిసి మున్సిపాలిటీ ముందు ధర్నా చేశారు. వెంటనే స్పందించిన మున్సిపల్ చైర్‌పర్సన్ కాసుల విజయ బాలరాజు కుక్కల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికకు ఆదేశాలు జారీ చేశారు.
ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది శనివారం నుంచి ప్రత్యేక వలలు, బోన్లతో వీధి కుక్కలను పట్టుకునే పనులు ప్రారంభించారు. పట్టణంలో స్వైర విహారం చేస్తున్న కుక్కలను వాహనాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బోన్లలో బంధించి అడవి ప్రాంతాల్లో వదిలేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
చైర్‌పర్సన్ కాసుల విజయ బాలరాజు మాట్లాడుతూ, కుక్కలతో పాటు పట్టణంలో కోతుల బెడద కూడా ఉందని, వాటి నియంత్రణకు కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీధి కుక్కలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టెరిలైజేషన్ చికిత్స, యాంటీ రేబిస్ టీకాల కోసం తరలించనున్నామని వెల్లడించారు. పట్టణ వ్యాప్తంగా ఉన్న వీధి కుక్కలను తరలిస్తామని, 15 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
కోతుల నియంత్రణకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు కొద్ది రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని, చిన్నారులను ఒంటరిగా బయటకు పంపవద్దని విజ్ఞప్తి చేశారు. ఇళ్ల పరిసరాల్లో ఆహార వ్యర్థాలు బయట వేయకుండా పరిశుభ్రత పాటించాలని సూచించారు.
కుక్కలు, కోతుల బెడదతో పాటు పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి కూడా మున్సిపాలిటీ అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని చైర్‌పర్సన్ కాసుల విజయ బాలరాజు అన్నారు. ఈ చర్యలపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. (కుక్కలను పట్టుతున్న వీడియో 👇)




إرسال تعليق