Top News

Sugar Price Hike | చక్కెర తీపి కరిగింది.. సామాన్యుడి గుండెల్లో మంట పుట్టింది!

  


చక్కెర తీపి కరిగింది.. సామాన్యుడి గుండెల్లో మంట పుట్టింది!

  • నెల రోజుల వ్యవధిలో అమాంతం పెరిగిన ధరలు
  • క్వింటాలుకు రూ.26 వేలకు పైగా ఎగబాకిన వైనం
  • కిలో రూ.40 నుంచి రూ.80కి జంప్.. కిరాణాదారుల ఇష్టారాజ్యం
  • నిఘా నీడ కరువై.. దోపిడీకి గురవుతున్న వినియోగదారులు
  • వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని బాన్సువాడ ప్రజల ఆవేదన

(షేక్ మహబూబ్/తెలంగాణ డైలీ న్యూస్/నస్రుల్లాబాద్ )

"ఉదయం లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు నిత్య జీవితంలో మమేకమైన చక్కెర ధర ఒక్కసారిగా నింగిని తాకింది. నిత్యావసర వస్తువుల్లో అత్యంత ప్రధానమైన దీని ధరలకు రెక్కలు రావడంతో సామాన్యులు, పేద, మధ్యతరగతి వర్గాల బతుకు భారంగా మారింది. కిరాణా దుకాణదారుల ఇష్టారాజ్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి.. ఇప్పుడు వినియోగదారులపై పెనుభారాన్ని మోపుతున్నాయి."

పెరిగిన ధరల వైనం ఇదీ..

కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రాంతంలో చక్కెర ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. సరిగ్గా నెల రోజుల క్రితం వరకు క్వింటాలు చక్కెర ధర సుమారు రూ.42 వేల వరకు మాత్రమే ఉండేది. కానీ, ఏమైందో ఏమో కానీ.. వ్యాపార వర్గాల సిండికేట్ పుణ్యమా అని అదే క్వింటాలు ధర ప్రస్తుతం ఏకంగా రూ.68 వేలకు చేరింది!

దీని ప్రభావం నేరుగా చిల్లర మార్కెట్‌పై తీవ్రంగా పడింది. గత నెల వరకు కిలో చక్కెర కేవలం రూ.40 నుంచి రూ.45 మధ్యలో లభించగా.. ప్రస్తుతం దుకాణదారులు దాన్ని రూ.70 నుంచి ఏకంగా రూ.80 వరకు అమ్ముతున్నారు. నెల రోజులు తిరగకుండానే ధర దాదాపు రెట్టింపు కావడంతో కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు.

సరిహద్దు రాకెట్.. దళారుల కబంధ హస్తాలు

కామారెడ్డి జిల్లాకు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి చక్కెర ప్రధానంగా సరఫరా అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతినెలా కేటాయించే కోటా మేరకు చక్కెర కర్మాగారాలు విక్రయాలు జరపాలి. అయితే, కొందరు పెద్ద వ్యాపారులు, దళారులు కుమ్మక్కై లారీల కొద్దీ నిల్వలను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించి.. ఆ భారాన్ని చివరకు చిల్లర వినియోగదారుడి నెత్తిన రుద్దుతున్నారనే తీవ్ర ఆరోపణలున్నాయి.

‘టీ’ తాగాలన్నా భయమే!

గ్రామీణ ప్రాంతాల్లో శ్రామికులు, రైతులు, సామాన్యుల దినచర్య టీతోనే ప్రారంభమవుతుంది. ఇక ఏ చిన్న శుభకార్యమైనా, ఇంటికి బంధువులు వచ్చినా తొలిచూపు టీ మీదే పడుతుంది. అలాంటిది పేదోడి పూట గడిచే ఆ గుప్పెడు చక్కెర ధర అమాంతం పెరగడంతో ఇళ్లల్లో బడ్జెట్ తలకిందులవుతోంది. ఇప్పటికే పప్పులు, నూనెలు, కూరగాయల ధరలతో అల్లాడిపోతున్న తమకు.. ఈ చక్కెర భారం మరింత కుంగదీస్తోందని ప్రజలు వాపోతున్నారు.

అధికారుల జోక్యమేదీ?

ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్న వ్యాపారుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించాలని కోరుతున్నారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత సృష్టిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్‌లో ధరలను నియంత్రించి, పేదలకు అందుబాటు ధరలో చక్కెర లభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


Post a Comment

أحدث أقدم