Top News

Traffic Chalans | బాన్సువాడలో ట్రాఫిక్ చలాన్ల మోత

వామ్మో.. తాడ్కోల్ చౌరస్తా! 

ఆ మార్గంలో వెళ్లాలంటేనే జంకుతున్న వాహనదారులు

బాన్సువాడలో చలాన్ల మోత - పట్టణంలో ప్రతి బండిపై 2 నుంచి 10 చలాన్లు

బాన్సువాడ, ఆగస్టు 22: బాన్సువాడ పట్టణంలో ద్విచక్ర వాహనదారులు తాడ్కోల్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా గుండా వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఆ మార్గాల గుండా వెళ్తే హెల్మెట్ లేదని, సిగ్నల్ జంప్ చేశారని ఆటోమేటిక్‌గా చలాన్లు పడుతుండటమే కారణం. పట్టణంలోని ప్రతి ద్విచక్ర వాహనంపై 2 నుంచి 10 వరకు చలాన్లు నమోదు కావడంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు.

పట్టణంలోని తాడ్కోల్, అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ కెమెరాల ద్వారా రోజుకు వందలాది చలాన్లు వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిగ్నల్ ఉల్లంఘిస్తే చలాన్ వేయడంలో తప్పులేదని, కానీ నిత్యావసరాల కోసం, ఇతర పనుల కోసం రోజూ వందలసార్లు అదే దారి గుండా వెళ్తుంటే హెల్మెట్ లేదనే కారణంతో జరిమానాలు వేయడం సరికాదని వారు వాపోతున్నారు.

ఈ విషయంపై తెలంగాణ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ఇటీవల జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. పట్టణం నడిబొడ్డున ఉన్న ఆటోమేటిక్ కెమెరాలను తొలగించి పట్టణ శివారులోని కోయిగుట్ట, బీర్కూర్ చౌరస్తా, తాడ్కోల్ గ్రామ పొలిమేరలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. 

బాన్సువాడ వాణిజ్య ప్రాంతం. ఇక్కడ పెద్ద పరిశ్రమలు లేవు. ప్రజలు రోజూ కష్టపడితేనే పూట గడుస్తుంది. రియల్ ఎస్టేట్, వ్యాపారం కొన్నేళ్లుగా మందగించింది. రోజుకు 500 రూపాయలు సంపాదించడమే కష్టంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కెమెరాల ద్వారా హెల్మెట్ లేకుండా వెళ్లే వారికి ఆటోమేటిక్‌గా రూ.235కు పైగా జరిమానా పడుతోంది. ఒకరికే రోజుకు 2 నుంచి 3 చలాన్లు వస్తున్నాయని, రోజుకు రూ.200 నుంచి రూ.600 వరకు కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కెమెరాల నియంత్రణ మొత్తం కామారెడ్డి పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి జరుగుతోందని తెలుస్తోంది.

సమాచారం ప్రకారం బాన్సువాడ పట్టణంలో రోజూ 400 నుంచి 500 మందికి చలాన్లు విధిస్తున్నారు. ప్రమాదాల ముప్పు పట్టణం నుంచి బయటకు వెళ్లే వారికే ఎక్కువ ఉంటుందని, అందువల్ల కెమెరాలను నగరం నడిబొడ్డు నుంచి తొలగించి శివార్లలో ఏర్పాటు చేయాలని ప్రజలు పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు.


Note : For Video link, Open in Description 

Post a Comment

أحدث أقدم