- స్టీరింగ్ చేతిలో, కెమెరా కళ్లలో... బార్డర్‌కు బార్డర్ వసూళ్ల బండారం బయటపెడుతున్న శ్యామ్‌లాల్
- రాజస్థాన్ నుంచి తమిళనాడు వరకు ప్రతి బార్డర్‌పై స్టింగ్
- మద్నూర్ చెక్‌పోస్ట్ వద్ద 200 రూపాయల డిమాండ్ వీడియో వైరల్
- ఎక్సైజ్, పోలీసు, RTO అధికారులపై చర్యలు
- దేశవ్యాప్తంగా డ్రైవర్ల నుంచి మద్దతు, వేలల్లో ఫాలోవర్స్
- ఎవరు ఈ శ్యామ్‌లాల్?
- తెలంగాణ డైలీ న్యూస్ స్పెషల్ స్టోరీ
(ఎస్ మోహియొద్దీన్ MA MCJ BEd✍️)
"లైసెన్స్ ఉంది, పేపర్లు ఉన్నాయి, అయినా డబ్బులు అడుగుతారా?"
ఈ ఒక్క ప్రశ్నతో ఒక రాజస్థాన్ డ్రైవర్ దేశంలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వసూళ్ల రాజకీయాన్ని ఒక్కసారిగా కుదిపేశాడు.
ఆయనే శ్యామ్‌లాల్. మిర్చి లోడుతో రాజస్థాన్ నుంచి తమిళనాడుకు వెళ్తున్న సాధారణ లారీ డ్రైవర్. కానీ ఆయన చేస్తున్న పని మాత్రం అసాధారణం.
రోడ్డే ఆయన స్టూడియో
గత 4 నెలల క్రితం కొన్న కొత్త లారీపై డ్రైవర్ గా పనిచేస్తున్న శ్యామ్‌లాల్... యూట్యూబర్ కూడా. ఉత్తరప్రదేశ్ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ప్రతి బార్డర్ దగ్గర ఆయన చేస్తున్నది ఒక్కటే - "స్టింగ్ ఆపరేషన్".
కెమెరా ఆన్ చేసి, అధికారులు డబ్బు అడిగే దృశ్యాలను రికార్డ్ చేసి, అదే క్షణం ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తున్నాడు.
మద్నూర్‌లో వైరల్ వీడియో
కామారెడ్డి జిల్లా మద్నూర్ ఎక్సైజ్ చెక్‌పోస్ట్ వద్ద ఎక్సైజ్ కానిస్టేబుల్ 200 రూపాయలు డిమాండ్ చేసిన వీడియోను శ్యామ్‌లాల్ రికార్డ్ చేశాడు. ఆ వీడియో ఇన్‌స్టాలో గంటల్లోనే వైరల్ అయింది. దీంతో ఉన్నతాధికారులు స్పందించి ఆ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వీడియో పై చర్చ సాగుతోంది.
ఇతర రాష్ట్రాల్లోనూ చర్యలు
ఇదొక్కటే కాదు. మహారాష్ట్రలోని నాయెగావ్ చెక్ పోస్టు, జగిత్యాల వద్ద పోలీసుల వసూళ్ల వీడియో, ఏపీలోని కోదాడ బార్డర్ , తమిళనాడులోని తిరువళ్లూరులో చేసిన స్టింగ్‌లు కూడా వరుసగా వైరల్ అయ్యాయి. ఆయన ఏ రాష్ట్రం లో వెళ్లినా ఆ రాష్ట్రం లో వసూళ్ళపై చర్చ సాగుతోంది.
తిరువళ్లూరులో పోలీసులు శ్యామ్‌లాల్‌ను బలవంతంగా స్టేషన్‌కు తీసుకెళ్లారు. కానీ DSP విచారించి సిబ్బందిదే తప్పని తేల్చి ఆయన్ను వదిలేశారు. మహారాష్ట్రలోని నాయిగావ్‌లో కూడా ఆయన వీడియోలతో వసూళ్లకు పాల్పడిన అధికారులపై చర్యలు జరిగాయి.
డ్రైవర్ల నుంచి సంఘీభావం
శ్యామ్‌లాల్‌ను తమిళనాడులో అరెస్ట్ చేశారన్న వార్త రాగానే వేలాది మంది డ్రైవర్లు ఫోన్లు, SMSలు చేసి ఆయన క్షేమం అడిగారు.
తమిళనాడు ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వయంగా రంగంలోకి దిగి "శ్యామ్‌లాల్ లాంటి వారిని అందరూ సపోర్ట్ చేయాలి" అని పిలుపునిచ్చారు.
శ్యామ్ లాల్ స్టింగ్ ఆపరేషన్ ఫోటోలు 👇👇
![]() |
| శ్యామ్ లాల్ కు మద్దతు తెలుపుతున్న తమిళనాడు రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ వెహికల్ అసోసియేషన్ అధ్యక్షులు |
శ్యామ్‌లాల్ చెబుతున్నది ఒక్కటే: "నేను నా కోసం కాదు. దేశవ్యాప్తంగా బార్డర్లపై జరుగుతున్న అక్రమ వసూళ్లను ఆపడానికే ఈ పోరాటం."
ఆయన వీడియోల ప్రభావంతో ఇప్పుడు అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద అధికారులు అప్రమత్తమయ్యారు. "కెమెరా ఉండొచ్చు" అన్న భయంతో చాలా చోట్ల వసూళ్లు తగ్గినట్లు డ్రైవర్లు చెబుతున్నారు.
సామాన్యుడి గళం
4 నెలల క్రితం కొన్న లారీ, చేతిలో ఫోన్. అంతే ఆయుధాలు. వాటితోనే ఒక డ్రైవర్ వ్యవస్థను ప్రశ్నిస్తున్నాడు.
అధికారులు, రాజకీయ నాయకులు కూడా పట్టించుకోని అక్రమ వసూళ్లపై శ్యామ్‌లాల్ లాంటి సామాన్యులు నడుం బిగించాల్సిన అవసరం ఉందని రవాణా రంగ నిపుణులు అంటున్నారు.
ఈరోజు శ్యామ్‌లాల్ ఇన్‌స్టా ఫాలోవర్స్ వేలల్లో ఉన్నారు. కానీ ఆయన లక్ష్యం ఫేమ్ కాదు. "బార్డర్‌పై ఒక్క రూపాయి లంచం ఆగినా అదే నా గెలుపు" అంటున్నాడు ఆ డ్రైవర్.
మామూలు డ్రైవర్ కాదు... వ్యవస్థకు అద్దం పట్టిన వాడు.
శ్యామ్ లాల్ వీడియోలు 👇










إرسال تعليق