Top News

Student Suicide | తల్లి బాధ చూసి తట్టుకోలేకపోయాడు...!

తల్లి బాధ చూసి తట్టుకోలేకపోయాడు...!

16 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యతో ఉస్మాన్‌పురాలో విషాదం

కామారెడ్డి: "అమ్మకు బాగా నొప్పిగా ఉంది" అన్న ఆలోచనే 16 ఏళ్ల బాలుడి ప్రాణం తీసింది. తల్లి ఆసుపత్రిలో ఉందన్న బాధను తట్టుకోలేక 10వ తరగతి విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డిలో కలకలం రేపింది. పట్టణ సి ఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం....

ఇంట్లో ఒంటరిగా ఉండగా...

ఉస్మాన్‌పురా కాలనీకి చెందిన మహ్మద్ ఇర్ఫాన్, అమీనా దంపతుల కుమారుడు మహ్మద్ అబ్దుల్ సమద్ సిద్ధికి(16). జీవదన్ హై స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు.  

రెండు రోజుల క్రితం తల్లి అమీనాకు కాలు విరగడంతో కుటుంబ సభ్యులంతా ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమద్ మాత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. శనివారం  రాత్రి 9 గంటలకు పెద్ద కుమారుడు ఇంటికి వచ్చి చూసేసరికి తలుపు లోపలి నుండి గడియ పెట్టి ఉంది. అనుమానంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా సమద్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.

"నా కొడుకు అమ్మ నొప్పి తట్టుకోలేక..."  

తన కుమారుడు తల్లి బాధను చూసి మానసికంగా కుంగిపోయాడని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడని తండ్రి మహ్మద్ ఇర్ఫాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.సమాచారం అందుకున్న కామారెడ్డి పట్టణ సీఐ నరహరి ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పాఠశాల, కుటుంబంలో విషాదం  

ఈ వార్త తెలిసి జీవదన్ హై స్కూల్ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపేందుకు సోమవారం  నాడు పాఠశాలకు సెలవు ప్రకటించింది. మంగళవారం నుండి తరగతులు యథావిధిగా జరుగుతాయని ప్రిన్సిపల్ తెలిపారు. సమద్ మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. 

ఒకే ఇంట్లో సంతోషంగా ఉండాల్సిన ఆ ఇల్లు ఇప్పుడు విషాదంతో నిండిపోయింది. తల్లి ఆసుపత్రి బెడ్‌పై, కొడుకు శవంగా మారడంతో ఆ కుటుంబం ఏమీ అర్థం కాని స్థితిలో ఉంది.

Post a Comment

أحدث أقدم