Top News

SP's Inspection | నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ రాజేష్ చంద్ర

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ రాజేష్ చంద్ర

బాధితుల ఫిర్యాదుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి - పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారానికి ఆదేశం

నేర నియంత్రణకు బీట్ సిస్టమ్ పటిష్టం చేయాలి - విజిబుల్ పోలీసింగ్ పెంచాలి

కామారెడ్డి, సెప్టెంబర్ 10 : జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లోని రికార్డులు, పెండింగ్ కేసులు, సీసీటీఎన్ఎస్ పనితీరు, స్టేషన్ పరిసరాలు, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా సిబ్బందితో నేరుగా మాట్లాడి విధుల నిర్వహణ గురించి ఆరా తీశారు. రోల్ కాల్ లో సిబ్బందికి ఇస్తున్న సూచనలు, టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారుల ఆదేశాలు క్షేత్రస్థాయి వరకు చేరుతున్నాయా అని తెలుసుకున్నారు. రోల్ కాల్ ను క్రమబద్ధంగా నిర్వహిస్తూ నేరాల నియంత్రణపై నిరంతర అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, బాధితులకు సత్వర న్యాయం అందించేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ ఆదేశించారు. పెండింగ్, లాంగ్ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

నేరాల నియంత్రణకు బీట్ సిస్టమ్ ను పటిష్టం చేసి ప్రతి గ్రామంపై నిఘా ఉంచాలని, బీట్ సిబ్బంది ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు, అనుమానాస్పద కదలికలపై ముందస్తు సమాచారం సేకరించాలని సూచించారు. బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాలతో నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తూ విజిబుల్ పోలీసింగ్ పెంచాలని ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, సైబర్ నేరాలు, ఆన్ లైన్ మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు.

రానున్న గణేష్ నవరాత్రుల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని, గణేష్ మండపాల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయించేలా నిర్వాహకులకు అవగాహన కల్పించాలని, నిమజ్జనం, ట్రాఫిక్ బందోబస్తుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఈ తనిఖీలో బాన్సువాడ డీఎస్పీ పి. విట్టల్ రెడ్డి, బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య, నిజాంసాగర్ ఎస్హెచ్ఓ శివకుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم