Top News

Interdistrict Thieves Arrest | అంతర్ జిల్లా ట్రాన్స్‌ఫార్మర్ చోరీ ముఠా అరెస్ట్

అంతర్ జిల్లా ట్రాన్స్‌ఫార్మర్ చోరీ ముఠా అరెస్ట్ - 52 దొంగతనాలు, హత్యాయత్నం కేసులు వెలుగులోకి..!

కామారెడ్డిలో 29, మెదక్‌లో 23 ట్రాన్స్‌ఫార్మర్ల కాపర్ కాయిల్స్ చోరీ - ముగ్గురు అరెస్ట్, ఒకరు పరారీ

అన్నదమ్ములే ముఠాగా - జల్సాలు, బెట్టింగ్ కోసం చోరీలు

కామారెడ్డి, సెప్టెంబర్ 11: ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్ కాయిల్స్ చోరీ చేస్తున్న అంతర్ జిల్లా ముఠాను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 30 కిలోల కాపర్ వైర్, దొంగతనాలకు ఉపయోగించిన వాహనం, పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు.

ఫిర్యాదులతో వెలుగులోకి:

అసిస్టెంట్ ఇంజనీర్ జాదవ్ బాలాజీ ఫిర్యాదు మేరకు గత ఐదు నెలలుగా భిక్నూర్ మండలంలోని బస్వాపూర్, భిక్నూర్, గుర్జకుంట, రమేశ్వరపల్లి, జంగంపల్లి, ర్యాగట్లపల్లి, రాజంపేట పరిధిలో 29 ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్ కాయిల్స్ చోరీ జరిగినట్లు కేసులు నమోదయ్యాయి. అలాగే సెప్టెంబర్ 9న రమేశ్వరపల్లి శివారులో చోరీని అడ్డుకున్న లైన్‌మెన్ ప్రభాకర్ పై హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలోనూ కేసు నమోదైంది.

ప్రత్యేక బృందాలతో దర్యాప్తు:

జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాలతో కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్ పర్యవేక్షణలో భిక్నూర్ సీఐ జె. నరేష్, సీసీఎస్ సీఐ సంతోష్ కుమార్, ఎస్ఐలు అనిల్, మహేష్ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి సెప్టెంబర్ 11న భిక్నూర్ పరిధిలోని పరివార్ హోటల్ వద్ద మరో చోరీకి వచ్చిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

అన్నదమ్ములే ముఠాగా - జల్సాలు, బెట్టింగ్ కోసం చోరీలు:

విచారణలో నిందితులు నలుగురు సొంత అన్నదమ్ములని తేలింది. జల్సాలు, ఆన్‌లైన్ బెట్టింగ్ అలవాటుతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పగటి వేళ రెక్కీ నిర్వహించి రాత్రి వేళ ట్రాన్స్‌ఫార్మర్లు చోరీ చేసి కాపర్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు గతంలోనూ దొంగతనం కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినా పద్ధతి మార్చుకోలేదని తెలిసింది.

నిందితుల వివరాలు:

1. బల్జీర్ సింగ్ చతుర్ సింగ్ టాక్ - (నార్సింగ్, తూప్రాన్ పరిధిలో రాబరీ కేసు)

2. రూప్ సింగ్ చతుర్ సింగ్ టాక్ - (బాన్సువాడ టౌన్ లో రెండు రాత్రి పూట ఇంటి దొంగతనాలు, మేడ్చల్ లో రాబరీ)

3. లకన్ చతుర్ సింగ్ టాక్

4. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

వీరిపై కామారెడ్డిలో 29, మెదక్ జిల్లాలో 23 చొప్పున మొత్తం 52 ట్రాన్స్‌ఫార్మర్ చోరీలు, ఒక హత్యాయత్నం, ఒక రాత్రి పూట ఇంటి దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

స్వాధీనం చేసుకున్నవి: Yamaha FZ బైక్, 1 మొబైల్ ఫోన్, 9 హ్యాక్సా బ్లేడ్లు, కటింగ్ ప్లయర్, కట్టర్, 9 పానలు, 10 రింగ్ పానలు, 3 రాడ్లు, 30 కిలోల కాపర్ వైర్.

పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోందని, అరెస్ట్ అయిన ముగ్గురిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించిన డీఎస్పీ మధుసూదన్, సీఐలు నరేష్, సంతోష్ కుమార్, ఎస్ఐలు అనిల్, మహేష్ తదితర సిబ్బందిని ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.



Post a Comment

أحدث أقدم