Top News

Best Teachers Awards | కళాభారతిలో ఘనంగా జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం

ఉపాధ్యాయుల బోధనలే నిరంతర ప్రేరణ

: కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి

కళాభారతిలో ఘనంగా జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం

58 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాల ప్రదానం

కామారెడ్డి, సెప్టెంబర్ 05: ఉపాధ్యాయుల బోధనలు తనకు నిరంతరం ప్రేరణను అందిస్తున్నాయని కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి అన్నారు.

జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

తన చిన్ననాటి విద్యాభ్యాసంలో బోధించిన ఉపాధ్యాయులను, వారు చూపిన అభిమానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాజకీయాలు తనకు కొత్త అయినప్పటికీ, నిరంతరం ఉత్సాహంతో పనిచేస్తూ పట్టణ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆలోచించేందుకు ఆనాటి ఉపాధ్యాయుల బోధనలు, సూచనలు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని తెలిపారు.

జిల్లా నుంచి జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు జిల్లాలో చక్కగా పనిచేస్తున్నారని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని కోరారు. ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రతి నెల ఒకటో తేదీన ఉపాధ్యాయులకు జీతాలు అందేలా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు.

అనంతరం జిల్లాలో ఎంపికైన ముగ్గురు గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ముగ్గురు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, 27 మంది స్కూల్ అసిస్టెంట్లు, 25 మంది ఎస్‌జీటీలు, ఒక మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు, ఒక కేజీబీవీ ప్రత్యేక అధికారికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రదానం చేశారు.

కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యారంగానికి అందించిన సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఏసీజీఈ బలరాం, డీసీఈబీ కార్యదర్శి లింగం, విద్యాశాఖ సమన్వయకర్తలు వేణుగోపాల్, నాగవేందర్, వెంకట రమణ రావు, కృష్ణ చైతన్య, సుకన్య, సిద్ధరామిరెడ్డి, ఎంఈఓలు యూసెఫ్, విజయ్ కుమార్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.













Post a Comment

أحدث أقدم