Top News

Drunk And Drive | కామారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై ఉక్కుపాదం

కామారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై ఉక్కుపాదం 

367 మందిపై కేసులు, రూ.5.17 లక్షల జరిమానా

మద్యం తాగి వాహనం నడిపిన 32 మందికి జైలు శిక్ష

కామారెడ్డి, సెప్టెంబర్ 12: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 367 మందిపై కేసులు నమోదయ్యాయి.

న్యాయస్థానంలో హాజరుపరచగా వారికి మొత్తం రూ.5,17,750 జరిమానా విధించారు. అందులో మద్యం సేవించి వాహనం నడిపిన 32 మందికి జైలు శిక్ష పడింది. 7 మందికి ఒక రోజు, 13 మందికి రెండు రోజులు, 6 మందికి మూడు రోజులు, 3 మందికి నాలుగు రోజులు, 3 మందికి ఐదు రోజుల చొప్పున జైలు శిక్ష విధించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల వాహనంపై నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువని అన్నారు. ప్రమాదాల్లో అమాయకుల ప్రాణాలతో పాటు వాహనదారుడి ప్రాణం కూడా పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఒక కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణం కోల్పోతే ఆ కుటుంబ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఒక్క క్షణం నిర్లక్ష్యం ఒక కుటుంబం మొత్తం భవిష్యత్తును మార్చేస్తుందని అన్నారు.

ఒక్క ప్రాణం కూడా ఎంతో విలువైనదని, డ్రంక్ అండ్ డ్రైవ్ ను అరికట్టడం ద్వారా ఒక్క ప్రాణాన్ని కాపాడగలిగినా ఆ కుటుంబంలో వెలుగు నింపినట్లేనని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్షతో పాటు జరిమానా తప్పదని స్పష్టం చేశారు.

మద్యం తాగిన తర్వాత వాహనం నడపకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

Post a Comment

أحدث أقدم