Top News

This is Road? | ఇది రోడ్డేనా... చెరువా..? పిట్లం - బాన్సువాడ రహదారి దుస్థితి

 

ఇది రోడ్డేనా... చెరువా..? పిట్లం - బాన్సువాడ రహదారి దుస్థితి

ఐదేళ్లుగా పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు - ప్రమాదాలకు నిలయంగా మారిన ప్రధాన రహదారి

బాన్సువాడ / పిట్లం, సెప్టెంబర్ 12: పిట్లం - బాన్సువాడ ప్రధాన రహదారి పరిస్థితి చూస్తే "ఇది రోడ్డేనా" అని ప్రతి వాహనదారుడు ప్రశ్నించేలా ఉంది. రోడ్డు నిండా గుంతలు, గుంతల నిండా నీళ్లు... వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది.

అటవీ ప్రాంతంలో పూర్తిగా ధ్వంసమైన రోడ్డు:

మద్దెల చెరువు నుంచి పిట్లం వరకు ఉన్న అటవీ ప్రాంతంలో రోడ్డు పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. దాదాపు ఐదేళ్లుగా ఈ రహదారికి మరమ్మతులు చేయకపోవడం, కొత్త రోడ్డు వేయకపోవడంతో తారు లేచిపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వర్షం పడితే ఆ గుంతల్లో నీళ్లు నిలిచి చిన్న చెరువులను తలపిస్తున్నాయి. ఫోటోల్లో కనిపిస్తున్నట్లు బైకులు, లారీలు గుంతలను తప్పించుకుంటూ అతి కష్టం మీద వెళ్తున్నాయి.

వందలాది వాహనాలకు ఇక్కట్లు - హైదరాబాద్ కి వెళ్లే ప్రధాన మార్గం:

బాన్సువాడ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే ఇదే ప్రధాన మార్గం. బాన్సువాడ నుంచి పిట్లం మీదుగా సంగారెడ్డి - నాందేడ్ - అకోలా హైవే పైకి వెళ్తారు. ప్రతిరోజూ వందలాది కార్లు, బైకులు, లారీలు, ఆర్టీసీ బస్సులు ఈ రోడ్డుపైనే వెళ్తుంటాయి. రోడ్డు అధ్వానంగా ఉండటంతో వాహనాలు తరచూ చెడిపోతున్నాయి. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

పట్టించుకోని ఆర్ అండ్ బి, ప్రజాప్రతినిధులు:

ఈ రోడ్డు ఆర్ అండ్ బి శాఖ పరిధిలోకి వస్తుంది. కానీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లా అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు నిత్యం ఈ రోడ్డు గుండానే వెళ్తున్నా కనీసం చొరవ చూపడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.

నిత్యం గుంతలమయ రోడ్డులో ప్రయాణించలేకపోతున్నామని, వెంటనే స్పందించి రోడ్డును పునరుద్ధరించాలని, గుంతలను పూడ్చి డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేయాలని వాహనదారులు, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.





Post a Comment

أحدث أقدم