గిన్నిస్ రికార్డు సాధించిన సయ్యద్ నబియా సుల్తానాకు ఘన సన్మానం
ఎల్లారెడ్డి ప్రాంతానికి గర్వకారణంగా నిలిచిన ప్రతిభావంతురాలు
ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సత్కారం
యువతకు స్ఫూర్తిగా నబియా విజయగాథ
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 05: ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ప్రతిభావంతురాలు సయ్యద్ నబియా సుల్తానా (తండ్రి: సయ్యద్ హబీబుల్లా) అరుదైన ఘనతను సాధించి ఎల్లారెడ్డి ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారు. ఆమె సాధించిన గిన్నిస్ వరల్డ్ రికార్డును పురస్కరించుకుని ఎల్లారెడ్డి ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
మల్లారెడ్డి యూనివర్సిటీలో 36 గంటల పాటు నిర్వహించిన ‘ఏజెంటిక్ ఏఐ హ్యాకథాన్-2025’లో పాల్గొని, ఏకంగా 2,089 మందితో కలిసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో భాగస్వామిగా నిలిచారు. ఈ అరుదైన విజయంతో ఆమె తన కుటుంబానికే కాకుండా ఎల్లారెడ్డి ప్రాంతానికి, ముఖ్యంగా యువతకు స్ఫూర్తిగా నిలిచారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు నబియా సుల్తానాను శాలువాతో ఘనంగా సత్కరించి హృదయపూర్వకంగా అభినందించారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఎల్లారెడ్డి నేలపై పుట్టి ప్రపంచ రికార్డు పుటల్లో చోటు సంపాదించిన నబియా సుల్తానా విజయం ప్రతి ఒక్కరికీ గర్వకారణం. ఆమె విజయగాథ రాబోయే తరాల యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు షేక్ గయాజుద్దీన్, ఉపాధ్యక్షులు సయ్యద్ మీర్, ముక్రమ్ అలీ, ప్రధాన కార్యదర్శి అజీజుర్ రెహమాన్, జాయింట్ సెక్రటరీలు అహ్మద్ పాషా, హబీబ్ జానీ, అలాగే కమిటీ సభ్యులు ఎండి నయీమ్, సమీర్, హఫీజ్ రఫీఖుల్లా తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق