సయ్యద్ నబియా సుల్తానాకు ఘన సన్మానం
మాజీ వైస్ ఎంపీపీ నునుగొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కారం
2,089 మందితో గిన్నిస్ రికార్డులో భాగస్వామ్యం
ఎల్లారెడ్డి ప్రాంతానికి గర్వకారణంగా నిలిచిన ప్రతిభ
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 05: ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ప్రతిభావంతురాలు సయ్యద్ నబియా సుల్తానా (తండ్రి: సయ్యద్ హబీబుల్లా) అరుదైన ఘనతను సాధించి ఎల్లారెడ్డి ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారు. ఆమె సాధించిన గిన్నిస్ వరల్డ్ రికార్డును పురస్కరించుకుని మాజీ వైస్ ఎంపీపీ నునుగొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
మల్లారెడ్డి యూనివర్సిటీలో గూగుల్ ఫర్ డెవలపర్స్, గూగుల్ డెవలపర్ గ్రూప్స్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో 2025 డిసెంబర్ 21న నిర్వహించిన ‘ఏజెంటిక్ ఏఐ హ్యాకథాన్’లో నబియా సుల్తానా పాల్గొన్నారు. 2,089 మందితో అత్యధిక మందితో నిర్వహించిన ఏజెంటిక్ ఏఐ హ్యాకథాన్ గా ఈవెంట్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. ఈ రికార్డులో భాగస్వామిగా నిలిచిన నబియా సుల్తానాకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ నుంచి అధికారిక సర్టిఫికెట్ లభించింది.
సర్టిఫికెట్ పై "The most participants in an agentic AI hackathon is 2,089 and was achieved by Google for Developers and Google Developer Groups Hyderabad (both India) in Hyderabad, Telangana, India on 21 December 2025" అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ కంచెర్ల శ్రీనివాస్, వ్యాపార వేత్త ఎం వెంకటేశం, సయ్యద్ హబీబుల్లాలు నబియా సుల్తానాను శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించి హృదయపూర్వకంగా అభినందించారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నునుగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి నేలపై పుట్టి ప్రపంచ రికార్డు పుటల్లో చోటు సంపాదించిన నబియా సుల్తానా విజయం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని అన్నారు. ఆమె విజయగాథ రాబోయే తరాల యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.


إرسال تعليق