Top News

TUWJ IJU | జర్నలిస్టుల ఆరోగ్య పథకం హామీని నెరవేర్చండి - TUWJ రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ డిమాండ్

జర్నలిస్టుల ఆరోగ్య పథకం హామీని నెరవేర్చండి - TUWJ రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ డిమాండ్

అక్రిడిటేషన్ల మంజూరులో కలెక్టర్ల తిరకాసు - అక్రమ కేసులపై ఆగ్రహం

ఆదిలాబాద్ జిల్లా మహాసభలో 200 మంది జర్నలిస్టుల హాజరు - నూతన కమిటీ ఎన్నిక

ఆదిలాబాద్, సెప్టెంబర్ 9: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇచ్చిన ఆరోగ్య పథకం హామీని ఇంతవరకు నెరవేర్చకపోవడం విచారకరమని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ IJU) రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ ఆందోళన వ్యక్తం చేశారు.

బుధవారం నాడు ఆదిలాబాద్ పట్టణంలోని తరంగిణి ఫంక్షన్ హాల్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) ఆదిలాబాద్ జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా NHIS పథకం అమలు కాకపోవడంతో అనారోగ్యాలకు గురవుతున్న జర్నలిస్టులు చికిత్స కోసం పడుతున్న తిప్పలు వర్ణనాతీతమని అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స పొందే ఆర్థిక స్తోమత లేక ఇప్పటికే వందల సంఖ్యలో జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాము పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా ఆరోగ్య పథకాన్ని అమలు చేసి జర్నలిస్టుల ప్రాణాలకు భరోసా కల్పించాలని కోరారు.

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల మంజూరులో కలెక్టర్లు తిరకాసు పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వెంటనే అలాంటి వైఖరికి స్వస్తి పలికి కార్డులను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జర్నలిస్టుల పట్ల వ్యవహరిస్తున్న వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. జిల్లాలో 15 మంది జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా, వారికి మంజూరైన అక్రిడిటేషన్ కార్డులను లాక్కోవడం సహించరానిదన్నారు. వెంటనే అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించారు. అలాగే జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అక్రిడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో విచారణ జరిపించడం సహించరానిదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఇద్దరు అధికారుల వైఖరిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.

జర్నలిజం వృత్తి పట్ల సమాజంలో విశ్వాసం సన్నగిల్లుతున్న నేటి పరిస్థితుల్లో, పవిత్రమైన మీడియా వృత్తికి పూర్వ వైభవం దక్కించేందుకు గాను నైతిక విలువలతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్ మాట్లాడుతూ, దశాబ్దాలుగా ఆదిలాబాద్ జిల్లాలో తమ సంఘం ఎంతో బలోపేతంగా ఉందని, అయితే సభ్యుల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా జిల్లా నూతన కమిటీ చిత్తశుద్ధితో సేవలందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలగందుల రవీందర్, ప్రకాష్ రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రజినీకాంత్, రాష్ట్ర నాయకుడు చిన్ను, మధ్యతరగతి పత్రికల సంఘం నాయకుడు హన్మంత్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్, కార్యదర్శి దేవేందర్ లతో పాటు జిల్లాలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 200 మంది జర్నలిస్టులు హాజరయ్యారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Post a Comment

أحدث أقدم