BJP Protest | అవసరమైతే అసెంబ్లీలో ధర్నా చేస్తా - మాధవ్ నగర్ ధర్నాలో ఎమ్మెల్యే హెచ్చరిక

నిజామాబాద్‌లో బీజేపీ గెలిచిందని మాధవ్ నగర్ ROBను నిర్లక్ష్యం చేస్తున్నారా? - ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ధ్వజం

అవసరమైతే అసెంబ్లీలో ధర్నా చేస్తా - మాధవ్ నగర్ ధర్నాలో ఎమ్మెల్యే హెచ్చరిక

తాజ్ /నిజామాబాద్, అక్టోబర్ 27: నిజామాబాద్‌లో బీజేపీ గెలిచిందన్న కారణంతోనే మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) పనులను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆరోపించారు.

మాధవ్ నగర్ ఆర్‌ఓబీ పనుల జాప్యానికి నిరసనగా మంగళవారం ఆయన ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, "నేను ఇక్కడికి ఎమ్మెల్యేగా కాదు, మీలో ఒకడిగా మీ బాధను పంచుకోవడానికి వచ్చాను" అని అన్నారు.

రోజూ నరకయాతన:

ఈ మాధవ్ నగర్ గేటు వద్ద ప్రజలు నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోడ్డు మీదుగా రోజూ 4 నుంచి 5 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తాయని, 24 గంటల్లో 58 రైళ్లు వెళ్తుండటంతో ప్రతిసారీ 15 నుంచి 20 నిమిషాల పాటు గేటు మూసివేయడం వల్ల భారీ ట్రాఫిక్ జామ్ అవుతోందన్నారు.

"ఈ సమస్యతో స్కూల్ పిల్లలు స్కూల్‌కి లేట్, కూలీలు పనికి లేట్, రోగులు హాస్పిటల్‌కి లేట్, ఉద్యోగులు ఉద్యోగానికి లేట్, చివరికి శవాలు కూడా స్మశానానికి లేట్‌గా వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రం నిధులు ఇచ్చింది, రాష్ట్రమే జాప్యం చేస్తోంది:

ఎంపీ ధర్మపురి అరవింద్ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించారని, రైల్వే శాఖ తన వంతు పని పూర్తి చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

గత ఏడాది ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసినప్పుడు వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినా, ఇప్పటివరకు పనులు పూర్తి కాకపోవడం నిజామాబాద్ అర్బన్ ప్రజలను అవమానించడమేనని విమర్శించారు.

అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ ఎంపీ అరవింద్‌తో కలిసి భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. అవసరమైతే ఈ అంశంపై అసెంబ్లీలోనూ ధర్నా చేస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు.







Post a Comment

أحدث أقدم