మహిళల ఆర్థిక స్వావలంబనతోనే రాష్ట్ర అభివృద్ధి: మంత్రి సీతక్క
- రూ. 10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనం ప్రారంభం
- ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చొరవతో నెరవేరిన మహిళల చిరకాల కోరిక
- హాజరైన కలెక్టర్, ఎస్పీ, డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్
రామారెడ్డి (పోసానిపేట్), అక్టోబర్ 27 (తెలంగాణ డైలీ న్యూస్): మహిళలు ఆర్థికంగా బలపడినప్పుడే గ్రామాలు, తద్వారా రాష్ట్రం శీఘ్రగతిన అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె. మదన్ మోహన్ రావుతో కలిసి మంత్రి సీతక్క మంగళవారం ఘనంగా ప్రారంభించారు.
అడిగిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే:
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ... పోసానిపేట్ గ్రామ మహిళా సంఘాల సభ్యులు తమ కార్యకలాపాల నిర్వహణకు ప్రత్యేక భవనం కావాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును కలిసి విజ్ఞప్తి చేశారని తెలిపారు. మహిళల అవసరాన్ని గుర్తించిన ఎమ్మెల్యే వెంటనే స్పందించి, తన చొరవతో రూ. 10 లక్షల నిధులు మంజూరు చేయించి భవన నిర్మాణాన్ని పూర్తి చేయించారని అభినందించారు.
"ఈ నూతన భవనం మహిళల ఆత్మగౌరవానికి, మీ ఐక్యతకు నిదర్శనంగా నిలవాలి. మహిళా సంఘాలకు అవసరమైన అన్ని వసతులు కల్పించడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ వేదికను మహిళల పొదుపు, ఉపాధి అవకాశాలు, గ్రామ అభివృద్ధికి సంబంధించిన చర్చలకు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి." — డా. దనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర మంత్రి
ఘన స్వాగతం – ప్రజాప్రతినిధులు, అధికారుల హాజరు:
గ్రామానికి విచ్చేసిన మంత్రి సీతక్క, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావులకు మహిళా సంఘాల సభ్యులు, స్థానిక ప్రజలు మంగళహారతులు, పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. తమ చిరకాల కోరికను నెరవేర్చినందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు, మంత్రికి మహిళా సంఘాల ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
![]() |
| సదశివానగర్ మండలం కుప్రియాల్ లో మంత్రి సీతక్క |











إرسال تعليق