ప్రాణం పోయినా... నలుగురికి ప్రాణం పోసిన కామారెడ్డి యువకుడు
కిడ్నీలు, లివర్, ఊపిరితిత్తుల దానం
కామారెడ్డిలో హృదయాన్ని కదిలించే ఘటన - మరణంలోనూ నలుగురికి జీవం పోసిన యువ వ్యాపారి పవన్ కుమార్
కామారెడ్డి, అక్టోబర్ 14: చావులోనూ బతుకును పంచిన ఓ యువ వ్యాపారి కథ ఇది. కామారెడ్డి పట్టణానికి చెందిన పవన్ కుమార్ జాజు (39) బ్రెయిన్ డెడ్ అయినా, అతని కుటుంబం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయంతో నలుగురు రోగులకు పునర్జన్మ లభించింది.
పాత బస్టాండ్, రాజానగర్ ప్రాంతానికి చెందిన పవన్ కుమార్ జాజు తండ్రి భగవాన్ జాజు. వృత్తిరీత్యా వ్యాపారి. కొద్ది రోజులుగా తలనొప్పితో బాధపడుతున్న ఆయనకు అకస్మాత్తుగా మెదడులో రక్తస్రావం (బ్రెయిన్ హెమరేజ్) అయింది. దీంతో అక్టోబర్ 7న కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున డాక్టర్లు బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు.
ఆ క్షణం... ఏ కుటుంబానికైనా గుండె పగిలే క్షణం. కానీ ఆ విషాదంలో కూడా జాజు కుటుంబం మానవత్వాన్ని చాటింది. తమ కుమారుడి అవయవాలు దానం చేయడానికి ముందుకు వచ్చింది. వారి అంగీకారంతో జీవన్ దాన్ సంస్థ రంగంలోకి దిగింది.
పవన్ కుమార్ కు చెందిన రెండు కిడ్నీలు, లివర్, ఊపిరితిత్తులను సేకరించి నలుగురు నిరుపేద రోగులకు అమర్చారు. నలుగురికి కొత్త జీవితం వచ్చింది.
ఈ సందర్భంగా జీవన్ దాన్ తెలంగాణ ఇంచార్జ్ ప్రొఫెసర్ భూషణ్ రాజు కుటుంబాన్ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. "మీ నిర్ణయం సమాజానికి ఆదర్శం. ఒకరి మరణం నలుగురికి జీవం పోసింది. ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన విషయం" అని అన్నారు. అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు జీవన్ దాన్ నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
నిజంగా... పవన్ కుమార్ భౌతికంగా లేకపోయినా, నలుగురి గుండెల్లో బతికే ఉంటాడు.

إرسال تعليق