1. మిర్చి, క్యాప్సికం సాగుతో అధిక లాభాలు - రైతుకు కలెక్టర్ ప్రశంసలు
2. జాతీయ ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
3. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడమే లక్ష్యం - కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
4. ఖరీఫ్ 2026-27 ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష
మిర్చి, క్యాప్సికం సాగుతో అధిక లాభాలు - రైతుకు కలెక్టర్ ప్రశంసలు
కూరగాయల సాగుతో తక్కువ పెట్టుబడికి అధిక ఆదాయం
రైతు కోమిరెడ్డి అంజయ్య పొలాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, అక్టోబర్ 31: మిర్చి, క్యాప్సికం సాగుతో అధిక లాభాలు పొందుతున్న రైతు కోమిరెడ్డి అంజయ్య పంట పొలాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించారు. పంట సాగు విధానం, దిగుబడి, మార్కెటింగ్, ఆదాయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు అంజయ్య మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా క్యాప్సికం సాగు చేస్తున్నానని, ఎకరంలో 30 టన్నుల దిగుబడి సాధించానని తెలిపారు. టన్ను రూ.40 వేల చొప్పున విక్రయించి రూ.12 లక్షల ఆదాయం వచ్చిందని, ఖర్చులు పోను రూ.10 లక్షల నికర లాభం పొందానని చెప్పారు. సంప్రదాయ వరి సాగు కంటే కూరగాయల సాగులో అధిక లాభం ఉందని, శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుందని తన అనుభవాన్ని వివరించారు. ఇతర రైతులు కూడా పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలని సూచించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. సంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని, మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా ఆధునిక పద్ధతులు పాటించాలని సూచించారు. భూమి, నీటి వనరులు, మార్కెట్ పరిస్థితులను బట్టి ఉద్యాన పంటలను ప్రోత్సహించాలని, వ్యవసాయ, ఉద్యాన శాఖల సలహాలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, ఉద్యాన శాఖ అధికారి జ్యోతి, వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, ఉద్యాన శాఖ అధికారి సుమన్, విస్తరణ అధికారి బాపురెడ్డి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
----------------------
2. జాతీయ ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కలెక్టరేట్ లో సర్దార్ పటేల్ జయంతి వేడుకలు
పటేల్ చిత్రపటానికి నివాళులర్పించి ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్
కామారెడ్డి, అక్టోబర్ 31: దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశాన్ని ఐకమత్యంగా ఉంచడంలో కృషి చేసిన ఉక్కు మనిషి పటేల్ జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవంగా జరుపుకుంటున్నామని, దేశానికి దిశానిర్దేశం చేసిన ఆయన చిరస్మరణీయుడని అన్నారు.
అనంతరం దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడటానికి అంకితమవుతానని, అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి తోడ్పాటునందిస్తానని అధికారులు, ఉద్యోగులతో రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, డీఆర్వో పాండు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.
-----------------
3. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, పరిశోధనా ఆసక్తి పెంపొందించడమే లక్ష్యం - కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
గ్రామీణ విద్యార్థులకు ఇస్రో సందర్శన అవకాశం - 772 మందితో క్విజ్ పరీక్ష
ఏటా రెండుసార్లు ఇస్రో క్విజ్ నిర్వహణకు కలెక్టర్ వినూత్న చొరవ
కామారెడ్డి, అక్టోబర్ 31: ఆర్థికంగా వెనుకబడిన గ్రామీణ విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల ఆసక్తిని పెంపొందించి పరిశోధన రంగం వైపు ప్రోత్సహించాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గత సంవత్సరం నిర్వహించిన ఇస్రో క్విజ్ లో 250 మంది పాల్గొనగా, ప్రతిభ ఆధారంగా 50 మంది విద్యార్థులు, 30 మంది ఉపాధ్యాయులకు ఇస్రో సందర్శన అవకాశం కల్పించారు. మంచి స్పందనతో ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 772 మంది విద్యార్థులతో క్విజ్ నిర్వహించారు. ఇందులో కామారెడ్డి డివిజన్ నుంచి 552 మంది, బాన్సువాడ డివిజన్ నుంచి 220 మంది పాల్గొన్నారు. ఈ పరీక్ష ద్వారా ప్రతిభ కనబరిచిన 50 మంది విద్యార్థులు, 30 మంది ఉపాధ్యాయులను ఇస్రో విద్యా సందర్శనకు ఎంపిక చేయనున్నారు. ఇకపై ప్రతి సంవత్సరం రెండుసార్లు ఇలాంటి పరీక్షలు నిర్వహించి మరింత మందికి అవకాశం కల్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా శాస్త్రీయ ఆలోచన, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని ఆకాంక్షించారు. గ్రామీణ విద్యార్థులకు ఇలాంటి అవకాశాలు భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ప్రేరణనిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గిరి, డీఈఓ మల్లికార్జున్, సైన్స్ అధికారి సిద్ధిరామిరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
-----------------------
4. ఖరీఫ్ 2026-27 ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష
ప్రతి కేంద్రంలో టార్పాలిన్లు, శుభ్రపరిచే యంత్రాలు అందుబాటులో ఉంచాలి
రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశం
కామారెడ్డి, అక్టోబర్ 31: ఖరీఫ్ 2026-27 ధాన్యం కొనుగోళ్ల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమీక్ష నిర్వహించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, కొనుగోలు కేంద్రాలకు గోదాములు మరియు రైస్ మిల్లుల ట్యాగింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యాన్ని కనీస మద్దతు ధర కంటే తక్కువకు విక్రయించే పరిస్థితి రాకుండా చూడాలని, కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.





إرسال تعليق