గాంధీ చౌక్ లో మూడేళ్ల బాలిక కిడ్నాప్ కేసులో సెషన్స్ కోర్టు సంచలన తీర్పు
బాలికను దాచిపెట్టిన నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష
కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని అభినందించిన సీపీ సాయి చైతన్య
తాజ్/నిజామాబాద్, అక్టోబర్ 8:
మూడేళ్ల మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీవీఎన్ భరత లక్ష్మి గురువారం తీర్పు ఇచ్చారు. నిందితుడికి వెయ్యి రూపాయల జరిమానా, జరిమానా కట్టని యెడల అదనంగా మూడు నెలల జైలు శిక్ష విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
మద్నూర్ మండలం సలాబాత్ పూర్ గ్రామానికి చెందిన గైక్వాడ్ బాలాజీ, సూర్యకాంత్ సోదరులు కూలీ పనులు చేసుకునేవారు. డబ్బు కోసం చిన్న పిల్లలను అపహరించి అమ్మాలనే దురాలోచనతో నిజామాబాద్ కు వచ్చారు.
గాంధారి మండలం ముదెల్లి నర్సాపూర్ గ్రామానికి చెందిన వీరం శిరీష తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడు, వృద్ధురాలైన తల్లితో కలిసి నాగారంలో ఉంటూ భిక్షాటన చేస్తూ జీవిస్తోంది. 2025 ఏప్రిల్ 6 రాత్రి గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహం దగ్గర తన తల్లి వద్ద మూడేళ్ల కూతురును ఉంచి భిక్షాటనకు వెళ్లగా తిరిగి వచ్చేసరికి బాలిక కనిపించలేదు. దీంతో ఆమె వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గైక్వాడ్ సోదరులను గుర్తించి సూర్యకాంత్ ను అరెస్ట్ చేశారు. తన అన్న బాలాజీయే బాలికను కిడ్నాప్ చేసి తనకు అప్పగించాడని, అమ్మే ప్రయత్నంలో ఉండగా పోలీసులు పట్టుకున్నారని నిందితుడు అంగీకరించాడు. దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయగా, విచారణ అనంతరం కోర్టు రెండో ముద్దాయి సూర్యకాంత్ కు శిక్ష ఖరారు చేసింది.
ఈ కేసులో శిక్ష పడేలా కృషి చేసిన టౌన్-1 ఎస్హెచ్ఓ రఘుపతి, ఎస్ఐలు మొగులయ్య, బాల్ సింగ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్ రెడ్డి, బ్రీఫింగ్ ఆఫీసర్లు, కోర్టు లైజన్ అధికారులను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అభినందించారు.

إرسال تعليق