కులం పేరుతో దూషించి, కాళ్లు కట్టి సెప్టిక్ ట్యాంకులో పడవేసి హత్య
పకడ్బందీ దర్యాప్తు చేసిన పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, 15 అక్టోబర్: పెద్దకొడపగల్ గ్రామంలో 25.11.2023న జరిగిన దారుణ హత్య కేసులో నిందితుడు కారాడి సాయికుమార్ (25) కు జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ నిజామాబాద్ రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి (ఎస్సీ/ఎస్టీ కోర్టు) ఎస్. నారాయణ తీర్పు వెలువరించారు.
కేసు వివరాలు: ఫిర్యాదురాలు మెట్టు మీది పాపవ్వ మనవడు బసవరాజ్, అదే గ్రామానికి చెందిన కారాడి సాయిలుతో కలిసి తిరిగేవాడు. స్థలం విక్రయించగా వచ్చిన రూ.25 లక్షల్లో తనకు డబ్బులు ఇవ్వాలని బసవరాజ్ అడగడంతో వదిలించుకోవాలని భావించిన నిందితుడు, కొత్త ఇంట్లో విందు పేరుతో పిలిచి మద్యం తాగించాడు. అర్ధరాత్రి డబ్బుల విషయంలో గొడవ జరగడంతో కులం పేరుతో దూషిస్తూ కర్రతో తలపై కొట్టి, కొబ్బరి తాడుతో మెడ బిగించి, కాళ్లు కట్టేసి నిర్మాణంలో ఉన్న ఇంటి సెప్టిక్ ట్యాంకులో పడవేసి హత్య చేశాడు. మూడు రోజుల తర్వాత మృతదేహం లభ్యమైంది.
పెద్దకొడపగల్ పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులు, కాలనీవాసులను విచారించి సాక్ష్యాధారాలు సేకరించి, నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ, నేరం ఎంత చాకచక్యంగా చేసినా చట్టం ముందు దోషులు తప్పించుకోలేరని అన్నారు. పకడ్బందీ దర్యాప్తు జరిపిన అప్పటి డీఎస్పీ కె. జగన్నాథ్ రెడ్డి, ప్రస్తుత బాన్సువాడ డీఎస్పీ పి. విఠల్ రెడ్డి, ఎస్హెచ్ఓ జి. అరుణ్ కుమార్, కోర్టు లైజనింగ్ అధికారులు ఏఎస్ఐ రాజేశ్వర్, శ్రీనివాస్, సీడీఓ జి. రవిచంద్ర గౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్. దయాకర్ గౌడ్ లను ప్రత్యేకంగా అభినందించారు.


إرسال تعليق