హన్మాజీపేట్ వ్యక్తి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!
భర్తను అడ్డు తొలగించుకునేందుకు భార్య పథకం.. ప్రియుడితో కలిసి హత్య
వివాహేతర సంబంధమే హత్యకు కారణం : DSP విఠల్ రెడ్డి వెల్లడి
మద్యం తాగించి నైలాన్ తాడుతో గొంతు బిగించి హత్య చేసిన ప్రియులు
సాంకేతిక ఆధారాలతో కేసు ఛేదించిన బాన్సువాడ పోలీసులు
కామారెడ్డి, అక్టోబర్ 30:
బాన్సువాడ మండలం హన్మాజీపేట్ శివారు పచ్చేరు చెరువు వద్ద జరిగిన చాకలి @ గుమ్మడి కాశీరాం (26) హత్య కేసును బాన్సువాడ పోలీసులు ఛేదించారు. భార్యతో సహా ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
డి ఎస్పీ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 23వ తేదీ రాత్రి హన్మాజీపేట్ శివారు పచ్చేరు చెరువు వద్ద కాశీరాం హత్యకు గురయ్యాడు. మృతుడి తండ్రి చాకలి భూమయ్య ఫిర్యాదు మేరకు బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ఆధారంగా ఇది హత్యగా నిర్ధారణ కావడంతో హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు.
జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు బాన్సువాడ DSP పి. విఠల్ రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి స్థానిక సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేసి ఈ రోజు ముగ్గురు నిందితులను హన్మాజీపేట్ గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు:
దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. A3 గుమ్మడి సవిత (25)కు A1 చింతకింది రాము (26), A2 పసుపుల సంతోష్ (25)లతో అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భర్త కాశీరాంను హత్య చేయాలని పథకం వేశారు.
పథకం ప్రకారం 23వ తేదీ రాత్రి కాశీరాంను మద్యం తాగేందుకు తీసుకెళ్లారు. అతను మత్తులో ఉన్న సమయంలో A1 రాము నైలాన్ తాడుతో మెడకు బిగించి హత్య చేయగా, A2 సంతోష్ తప్పించుకోకుండా చేతులను గట్టిగా పట్టుకుని సహకరించాడు. అనంతరం మృతదేహాన్ని పచ్చేరు చెరువులో పడేసి సాక్ష్యాలను మాయం చేసేందుకు ప్రయత్నించారు. ఈ కుట్రలో A3 సవిత కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, ఇతర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.
ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన బాన్సువాడ SHO టి. శ్రీధర్, క్రైమ్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్, కానిస్టేబుళ్లు పృథ్వీకుమార్, పాండురంగ, సుదర్శన్ రావులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
(వీడియోలో చెరువులో నుండి మృతదేహాన్ని బయటకు తీస్తున్న దృశ్యాలు, నిందితులను పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్న దృశ్యాలు ఉన్నాయి👇)


إرسال تعليق