వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతా - పోచారం భాస్కర్ రెడ్డి
అర్హులైన వికలాంగులను గుర్తించాలి
బాన్సువాడ నియోజకవర్గంలోని నేతలకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి
బాన్సువాడ, అక్టోబర్ 9:
వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే తన సంకల్పమని, ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే తన లక్ష్యమని మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు.
బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని ప్రతి వికలాంగునికి వారి అవసరాలకు అనుగుణంగా కృత్రిమ చేతులు, కాళ్లు ఏర్పాటు చేయించాలనే సంకల్పంతో ఈ మానవతా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ఇందులో భాగంగా గత నెల సెప్టెంబర్ 30న బాన్సువాడ పట్టణ కేంద్రంలో ముగ్గురికి కృత్రిమ అవయవాల పంపిణీ చేసినట్లు గుర్తుచేశారు. ఈ సేవను ప్రతి గ్రామానికి విస్తరించి అవసరమైన ప్రతి ఒక్కరికీ సహాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఆయన విజ్ఞప్తి చేశారు. మీ గ్రామాల్లో ఉన్న ప్రతి వికలాంగుడి ఇంటికి వెళ్లి వారి పూర్తి వివరాలు, ఫోన్ నంబర్, అంగవైకల్యానికి గల కారణం, అవసరమైన సహాయక పరికరాల వివరాలను సేకరించి అందించాలని కోరారు.
దసరా పండుగ అనంతరం మండలాల వారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని, ఆ క్యాంపులకు వారిని తీసుకురావడంలో నాయకుల సహకారం అవసరమని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో కృత్రిమ అవయవాలు పొందలేక ఇబ్బంది పడుతున్న వారికి ఆత్మవిశ్వాసంతో జీవించేలా చేయూతనివ్వడమే ఈ కార్యక్రమ ఉద్దేశమన్నారు.
మన చిన్న ప్రయత్నం ఒకరి జీవితంలో గొప్ప మార్పుకు నాంది కావచ్చని, ఒక్క అర్హుడు కూడా సహాయానికి దూరం కాకూడదని, అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

إرسال تعليق