Senior Journalist Death | సీనియర్ జర్నలిస్టు యండమూరి వరప్రసాద్ మృతి

సీనియర్ జర్నలిస్టు యండమూరి వరప్రసాద్ మృతి - పాత్రికేయ లోకంలో తీవ్ర విషాదం

జర్నలిజానికి తీరని లోటు : TUWJ IJU జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ 

బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు యండమూరి వరప్రసాద్ (58) శనివారం తన స్వగృహంలో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్  ఆసుపత్రిలో చికిత్స పొందారు. శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వరప్రసాద్ మృతి వార్త తెలియగానే బాన్సువాడ, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పాత్రికేయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

పాత్రికేయ ప్రస్థానం:

యండమూరి వరప్రసాద్ తన జర్నలిజం ప్రస్థానాన్ని 2002లో  ఆంధ్రజ్యోతి ద్వారా ప్రారంభించి, రాష్ట్రంలోని ప్రముఖ దినపత్రికలైన సాక్షి, ఆంధ్రజ్యోతి, సూర్య పత్రికల్లో చాలా సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేశారు. బాన్సువాడ ప్రాంతంలో ఆయన పేరు తెలియని వారు ఉండరు. దశాబ్దాల పాటు బాన్సువాడ RC గా పని చేసి బీర్కూర్, నస్రుల్లాబాద్, బిచ్కుంద, జుక్కల్ తదితర ప్రాంతాల్లో  ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చారు.

ప్రజల పక్షాన కలం:

వరప్రసాద్ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడ్డారు. రైతుల సమస్యలు, రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి వంటి అంశాలపై ఎన్నో పరిశోధనాత్మక కథనాలు రాశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిర్భయంగా ప్రశ్నించేవారు. ఆయన రాసిన అనేక కథనాల వల్ల ఎన్నో గ్రామాల సమస్యలు పరిష్కారమయ్యాయి. 

నిష్పక్షపాత వైఖరి, నిజాయితీ, స్నేహపూర్వక స్వభావంతో ఆయన ప్రజల గుండెల్లో, జర్నలిస్టు మిత్రుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. కొత్త జర్నలిస్టులకు మార్గదర్శకుడిగా నిలిచారు.

కుటుంబ వివరాలు:

వరప్రసాద్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన పార్థివ దేహాన్ని బాన్సువాడలోని పిఎస్ ఆర్ జర్నలిస్ట్ కాలనీ లో స్వగృహంలో  దర్శనార్థం ఉంచారు. అంత్యక్రియలు ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తామని  కుటుంబ సభ్యులు తెలిపారు.

సంతాపం:

వరప్రసాద్ మృతి పట్ల బాన్సువాడ ఎమ్మెల్యే, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, సీనియర్ జర్నలిస్టులు, టీయూడబ్ల్యూజే, ప్రెస్ క్లబ్ సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.అలాగే TUWJ(IJU) జిల్లా అధ్యక్షులు రజనీకాంత్,జిల్లా కార్యదర్శి తోట రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, సుధాకర్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ ఏ లతీఫ్,అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు ఎస్ కె మోహియొద్దీన్, చంద్రశేఖర్ లు సంతాపం తెలియజేశారు.

జర్నలిజానికి తీరని లోటు : TUWJ IJU జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ 

"వరప్రసాద్ లాంటి నిబద్ధత కలిగిన జర్నలిస్టును కోల్పోవడం బాన్సువాడ జర్నలిజానికి తీరని లోటు" అని TUWJ IJU జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ పేర్కొన్నారు. ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  ఇటీవల మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి లు ప్రసాద్ ను పరామర్శించారని పేర్కొన్నారు.  ప్రసాద్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకొంటామని అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు 

Post a Comment

أحدث أقدم