Action on Gambling | జిల్లాలో జూద నిర్మూలనకు 4 ప్రత్యేక పోలీసు బృందాలు - ఎస్పీ రాజేష్ చంద్ర

జిల్లాలో జూద నిర్మూలనకు 4 ప్రత్యేక పోలీసు బృందాలు - ఎస్పీ రాజేష్ చంద్ర

24/7 నిఘా, ఆకస్మిక దాడులు - జూదం జీవితాలను చిన్నాభిన్నం చేసే వ్యసనం - ఎస్పీ హెచ్చరిక

జూదం కేసుల్లో పట్టుబడితే ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రభావం - సమాచారం ఇస్తే గోప్యత - కంట్రోల్ రూం నం. 8712686133

కామారెడ్డి, నవంబర్ 3: జిల్లాలో జూదం, పేకాట కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ జిల్లావ్యాప్తంగా జూద స్థావరాలపై నిఘా, ఆకస్మిక దాడులు నిర్వహిస్తాయి.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో కొందరు జూదానికి బానిసై జీవితాలను, కుటుంబాల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నారని అన్నారు. కష్టపడి సంపాదించిన సొమ్మును కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, దీంతో కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని పేర్కొన్నారు.

ముఖ్యంగా యువత క్షణిక ఆశలకు లోనై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. జూదం కేసుల్లో పట్టుబడితే కేసులు పోలీసు రికార్డుల్లో నమోదవుతాయని, వేలిముద్రలు సేకరించి భద్రపరుస్తారని, భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకు పోలీసు వెరిఫికేషన్‌లో ప్రభావం పడుతుందని హెచ్చరించారు.

ఎక్కడైనా జూదం ఆడుతున్నా, నిర్వహిస్తున్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రజలు తమ పరిసరాల్లో జూదం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్  8712686133 కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Post a Comment

أحدث أقدم