SP Review | జూదం నిర్మూలనకు 4 ప్రత్యేక బృందాలతో 24/7 నిఘా

నేర నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యం: ఎస్పీ రాజేష్ చంద్ర

పెండింగ్, మిస్సింగ్ కేసుల ఛేదనపై ప్రత్యేక దృష్టి పెట్టండి

జూదం నిర్మూలనకు 4 ప్రత్యేక బృందాలతో 24/7 నిఘా

కామారెడ్డి, నవంబర్ 6: నేర నియంత్రణ, కేసుల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి అధికారి పోలీస్ శాఖ ప్రతిష్ఠ పెరిగేలా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర సూచించారు.

కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అధ్యక్షతన జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నమోదైన కేసుల పురోగతి, దర్యాప్తు నాణ్యత, పెండింగ్ కేసుల పరిష్కారం, నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించే అంశాలపై సమగ్రంగా సమీక్షించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

సమావేశంలో భాగంగా ఎస్పీ సీసీటీఎన్ఎస్ అప్లికేషన్ ను స్వయంగా పరిశీలించి, వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతిని ఆన్ లైన్ ద్వారా పరిశీలించారు. కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలు, దర్యాప్తు పత్రాలు, వీడియోలు, ఫొటోలను అప్లికేషన్ లో ఏ విధంగా నమోదు చేస్తున్నారో క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి కేసుకు సంబంధించిన వివరాలు, కీలక ఆధారాలను క్రమపద్ధతిలో నిర్ణీత సమయంలో సీసీటీఎన్ఎస్ లో నమోదు చేయాలని, దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని సూచించారు.

ప్రతి కేసులో నాణ్యమైన, నిష్పాక్షికమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీసుల ప్రాథమిక బాధ్యతని ఎస్పీ స్పష్టం చేశారు. శాస్త్రీయ, సాంకేతిక ఆధారాల సేకరణకు ప్రాధాన్యతనిస్తూ న్యాయస్థానాల్లో నేరస్థులకు శిక్ష పడేలా పటిష్టమైన ఆధారాలతో ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని సూచించారు. దర్యాప్తులో ఎదురయ్యే సాంకేతిక, చట్టపరమైన సందేహాల నివృత్తికి ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు.

దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులు, మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని, నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలును వేగవంతం చేయాలని ఆదేశించారు. జైలు నుంచి విడుదలైన వ్యక్తుల పర్యవేక్షణ వ్యవస్థ (జైల్ రిలీజ్ మానిటరింగ్ సిస్టమ్) గురించి అన్ని ఎస్ హెచ్ ఓలు, అధికారులకు వివరించారు. ఈ వ్యవస్థ ద్వారా విడుదలైన వ్యక్తుల వివరాలను నమోదు చేసి, వారి కదలికలు, ప్రవర్తన, కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. తిరిగి నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులపై ముందస్తు నిఘా ఉంచి నేరాల పునరావృతిని అరికట్టాలని దిశానిర్దేశం చేశారు.

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి అవసరమైన హెచ్చరిక బోర్డులు, రహదారి భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, ట్రాఫిక్ నిబంధనల అమలును కట్టుదిట్టం చేస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, గంజాయి అక్రమ రవాణా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూదం, పేకాట నిర్మూలనకు 4 ప్రత్యేక బృందాలతో 24/7 నిఘా ఉంటుందని, జూదం ఆడినా, నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, షీ టీమ్స్ నిరంతరం అప్రమత్తంగా పనిచేయాలని, మహిళలపై వేధింపులను అరికట్టడంతో పాటు విద్యాసంస్థల్లో భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించాలని, ప్రధాన కూడళ్లు, గ్రామాల ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో నిఘాను బలోపేతం చేయాలని తెలిపారు. రాత్రి గస్తీ, బీట్ పెట్రోలింగ్ ను సమర్థవంతంగా నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని బ్యాంకులు, ఏటీఎంల వద్ద అలారం సిస్టమ్ లు, సీసీ టీవీలు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రతి పోలీస్ అధికారి తన విధి నిర్వహణ ద్వారా పోలీస్ శాఖపై ప్రజల్లో గౌరవం, నమ్మకం మరింత పెరిగేలా పనిచేయాలని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలు, ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, విధుల్లో క్రమశిక్షణ, పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని సూచించారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాసరావు, బాన్సువాడ డీఎస్పీ పి. విట్టల్ రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ గట్టుమల్లు, ఏఆర్ డీఎస్పీ ఉదయ్ భాస్కర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ సంపత్ కుమార్, జిల్లాలోని సర్కిల్ ఇన్ స్పెక్టర్లు, సబ్ ఇన్ స్పెక్టర్లు, డీపీఓ రైటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





Post a Comment

أحدث أقدم