భగవద్గీత పఠనంలో 'ఎలైట్ వరల్డ్ రికార్డ్' సాధించిన అన్నదమ్ములు

 

చిన్నారుల అసాధారణ ప్రతిభ!

కురుక్షేత్ర నుండి శృంగేరి వరకు: ఆధ్యాత్మిక వేదికలపై మారుమోగిన కామారెడ్డి చిన్నారుల పేరు

శ్లోకాలతో శ్రద్ధ, జ్ఞాపకశక్తికి నిదర్శనం – చిన్నారుల ప్రతిభకు ప్రశంసలు

గీతా పఠనంతో గోల్డ్ మెడల్ సాధించిన చిన్నారులను అభినందించిన జిల్లా ఎస్పి  యం. రాజేష్ చంద్ర 

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:

         భిక్నూర్ ఎస్.ఐ. ఆంజనేయులు  కుమారులు కుశాల్ మనోహర్ యాదవ్, కార్తీక్ మనోహర్ యాదవ్ లు ఆధ్యాత్మిక రంగంలో అద్భుత ప్రగతిని కనబరుస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా 'గీతా పరివార్' నిర్వహిస్తున్న ఆన్‌లైన్ తరగతుల ద్వారా శిక్షణ పొందుతూ, భగవద్గీతలోని 18 అధ్యాయాలలో గల 700 శ్లోకాలను అనర్గళంగా కంఠతా నేర్చుకున్నారు. వీరి అకుంఠిత దీక్షకు గుర్తింపుగా గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా, ప్రతిష్టాత్మకమైన "గీతావ్రతి"గా గుర్తింపు పొందారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్వహించిన "జ్ఞానస్మృతి" కార్యక్రమంలో తమ ప్రతిభను చాటి "Elite World Record" సర్టిఫికేట్‌ను సొంతం చేసుకున్నారు.

ఈ చిన్నారుల ప్రతిభ దేశవ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలలో ప్రశంసలు అందుకుంటోంది. గత ఏడాది జూన్ నెలలో శృంగేరి శారదా పీఠంలో నిర్వహించిన గీతా జ్ఞాన యజ్ఞంలో పాల్గొని, జగద్గురువులు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారి ఆశీస్సులు, ప్రశంసలు అందుకున్నారు. అలాగే ఇటీవల హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో నిర్వహించిన "సహస్ర గీతాపఠన" కార్యక్రమంలో దేశం నలుమూలల నుండి వచ్చిన గీతా పాఠకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా గురువు బాబా రాందేవ్ మరియు అయోధ్య రామాలయ ట్రస్టు కోశాధికారి గురు గోవింద్ గిరి గారి చేతుల మీదుగా ప్రత్యేక ప్రశంసలు అందుకొని జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టారు.

చిన్నారులు సాధించిన ఈ అరుదైన విజయాలను తెలుసుకున్న జిల్లా ఎస్పి  రాజేష్ చంద్ర, ఈరోజు వారిని జిల్లా పోలీస్ కార్యాలయానికి పిలిపించుకొని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారులు ఎస్పి సమక్షంలో భగవద్గీత శ్లోకాలను అత్యంత స్పష్టంగా పఠించారు. చిన్నారులు పఠించిన శ్లోకాలను శ్రద్ధగా విన్న ఎస్పి, వాటి అర్థాలను అడిగి తెలుసుకోగా.. పిల్లలు ఆ శ్లోకాల అంతరార్థాన్ని ఎంతో అద్భుతంగా వివరించారు. చిన్నారుల ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని చూసి ఎస్పి గారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వారిని మనస్ఫూర్తిగా ప్రశంసించారు.

అనంతరం ఎస్.పి చిన్నారులకు స్వీట్లు తినిపించి, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ఆశీస్సులు అందజేశారు. చిన్న వయసులోనే ఇలాంటి ఉత్తమ మార్గంలో నడిపిస్తున్న తల్లిదండ్రులను అభినందిస్తూ, భవిష్యత్తులో ఈ చిన్నారులు ఉన్నత స్థాయికి ఎదిగి కన్నతల్లిదండ్రుల పేరుతో పాటు కామారెడ్డి జిల్లా పేరును కూడా దశదిశలా చాటాలని ఆకాంక్షించారు. 

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి కె నరసింహ రెడ్డి, భిక్నూర్ ఎస్.ఐ. ఆంజనేయులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post