👉ఎండగట్టిన కాంగ్రెస్ పాలనా వైఫల్యాలు
👉కరెంటుకు ఏ రోగం వచ్చింది? విద్యుత్ సంక్షోభం పై ప్రశ్న
👉పార్టీ ప్రధాన కార్యదర్శిగా జీవన్ రెడ్డి
(తెలంగాణ డైలీ న్యూస్ డెస్క్)
జగిత్యాల వేదికగా జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో సమాధానమిస్తూనే, రాష్ట్రంలో ప్రస్తుత పాలనలోని వైఫల్యాలను ఎండగట్టారు. జగిత్యాలలో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద యాత్ర వేదికపై నుంచి మాజీ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి గులాబీ కండువా కప్పిన కేసీఆర్.. పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. ఈ క్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ప్రజా ఆశీర్వాద యాత్ర సభ వేదికగా తన అనుచరులు భారీగా జీవన్ రెడ్డి.. గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి అనుభవాన్ని, ఆయన సేవలను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఉపయోగించుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. “ఒకప్పుడు అసెంబ్లీలో తెలంగాణ అనే పదం వాడటానికే వీల్లేకుండా రూలింగ్ ఇచ్చేవారు. బషీర్ బాగ్ కాల్పుల్లో రైతులు చనిపోయినప్పుడు భరించలేక పార్టీ పెట్టి బయలుదేరాను. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని చావు నోట్లోకి వెళ్లి రాష్ట్రాన్ని సాధించాను” అని కేసీఆర్ భావోద్వేగంగా మాట్లాడారు. ఇప్పుడు కొందరు కేసీఆర్ చావాలని కోరుకుంటున్నారని, కానీ పిల్లి శాపాలకు ఉట్లు తెగవని, తాను ఇప్పుడప్పుడే చావనని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై కేసీఆర్ ఘాటుగా స్పందించారు. “మేము అధికారంలో ఉన్నప్పుడు కరెంటు సక్కగా ఉండేది. ఇప్పుడు కరెంటుకు ఏ రోగం వచ్చింది? ఏమైనా కాకి ఎత్తుకపోయిందా?” అని ప్రశ్నించారు. 20 వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉన్న రాష్ట్రాన్ని ఈ ‘దరిద్రుల’ చేతిలో పెడితే.. నేడు ప్రజలు చీకట్లో మగ్గుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో తాను హెచ్చరించినట్లే జరుగుతోందని కేసీఆర్ అన్నారు. “వీళ్లు గెలిస్తే దళిత బంధుకి జైభీమ్, రైతుబంధుకి రాం రాం అని చెబుతారని ముందే చెప్పాను.
ఇప్పుడు అదే జరుగుతోంది. రైతుబంధు డబ్బులు నెలల తరబడి వేస్తారా? రైతుల కష్టాలు వీళ్లకు పట్టడం లేదు” అని మండిపడ్డారు. ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చే మిషన్ భగీరథ పథకాన్ని ఎందుకు కుంటుపడేలా చేస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రజలకు నీళ్లు ఇవ్వడంలో విఫలమైతే.. “లాగులు పగిలేలా కొట్టాలి” అంటూ తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ ఉన్నంత వరకు ప్రజల పక్షాన పోరాటం ఆగదని, కాంగ్రెస్ వైఫల్యాలను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గుండె ధైర్యమున్న నేత అని త కేసీఆర్ అన్నారు. 40 ఏళ్ల నుంచి జీవన్‌రెడ్డితో తనకు మంచి స్నేహం ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే జీవన్‌రెడ్డి పార్టీలోకి వచ్చారని తెలిపారు. భిన్న రాజకీయ సిద్ధాంతాలతో వేర్వేరు పార్టీల్లో పనిచేశామని చెప్పారు. జగిత్యాల ప్రాంతం కోసం జీవన్‌రెడ్డి ప్రాణం పెట్టి పనిచేశారని తెలిపారు.ఎమ్మెల్యేగా, మంత్రిగా చిత్తశుద్ధితో పనిచేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం జీవన్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారని తెలిపారు.
'ఇవాళ తెలంగాణ అగమ్యగోచరంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడితే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసినట్లే. చంద్రబాబు నాడు కరెంట్ ఛార్జీలు పెంచితే నేను ఉత్తరం రాశా. బషీర్ బాగ్ లో రైతులపై కాల్పులు జరిపిన బాబు పాలనపై ధ్వజమెత్తి ఉద్యమాన్ని ఆరంభించాను.
రోషయ్య 14 ఎఫ్ అని ఓ జీవో తెచ్చి తెలంగాణ వారికి ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నారు. ఆనాడే ఆమరణ దీక్షకు బయల్దేరా. చిదంబరం ప్రకటన తర్వాత హైడ్రామా క్రియేట్ చేశారు. వచ్చిన తెలంగాణకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు క్లిష్టమైన విషయం. బీహార్ లో పని చేస్తున్న జీఆర్ రెడ్డి అనే చొప్పదండి ఇంజనీర్ ను పిలిపించుకుని ప్రణాళిక రూపొందించుకున్నాం. మిషన్ కాకతీయ వంటి అద్భుతమైన పథకాలు తీసుకొచ్చాం. మిషన్ భగీరథ పూర్తి చేయకుంటే ఓట్లడగనని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా.. నేను తప్ప..?' అని వ్యాఖ్యానించారు.



Post a Comment