•ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు బలమైన అడుగు
•గూడెంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం
•మహిళా, శిశు భద్రతపై అవగాహన సదస్సు
•లబ్ధిదారు ఇంట్లో భోజనం చేసిన సీతక్క, షబ్బీర్ అలీ, కలెక్టర్
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లాలో పలు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీమతి డి. అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. (భోజనం చేస్తున్న వీడియో 👇)
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం
కామారెడ్డి మండలం గూడెం గ్రామంలో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని లబ్ధిదారులకు చీరె సారె అందించారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మండల అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కల సాకారం అవుతోందని, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
శిశు భద్రతపై అవగాహన సదస్సు
అనంతరం కళాభారతిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో “శిశు భద్రత & రక్షణ” అంశంపై సమగ్ర అవగాహన కార్యక్రమం జరిగింది. మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ IAS, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, టీజీసీఆర్ సభ్యురాలు ప్రేమలత అగ్రవాల్, మున్సిపల్ చైర్‌పర్సన్ ఎప్ప ఉమారాణి, అదనపు కలెక్టర్ మధుమోహన్, జిల్లా సంక్షేమ అధికారి ఏ. ప్రమీలా జ్యోతి ప్రజ్వలన చేశారు.
ముఖ్య అతిథులు మాట్లాడుతూ, ఆడపిల్లలు విద్యపై దృష్టి పెట్టాలని, సోషల్ మీడియా రీల్స్ వంటి వాటిపై సమయం వృథా చేయొద్దని సూచించారు. మహిళా సంఘాల ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని, ఇందిరా మహిళా శక్తి కాంటీన్ వంటి కార్యక్రమాలు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాయని తెలిపారు.
శిశు సంరక్షణ సంస్థల్లోని పిల్లలకు న్యాయపరమైన హక్కులు, ఆరోగ్యం, విద్య, భద్రతపై అవగాహన కల్పించారు. పిల్లల సమస్యలకు పరిష్కార మార్గాలపై చర్చించారు.
అనంతరం మంత్రి సీతక్క కామారెడ్డి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.




Post a Comment