MLA Laxmikant Rao Visits | జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సుడిగాలి పర్యటన





 [ఫోటో: నిజాంసాగర్‌లో వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపనలో పూజలు చేస్తున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్]

= పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సమస్యలపై సమీక్ష

 తెలంగాణ డైలీ న్యూస్,జుక్కల్ : జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బుధవారం నిజాంసాగర్, పిట్లం, మొహమ్మద్ నగర్ మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని అధికారులతో సమీక్షలు నిర్వహించారు.

నిజాంసాగర్‌లో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం:

నిజాంసాగర్ మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సర్పంచులు తమ గ్రామాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బంజపల్లిలో వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన:

నిజాంసాగర్ మండలం బంజపల్లి గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మందిరంలో జరిగిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు. అనంతరం నిజాంసాగర్ మండల ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

పిట్లంలో అటవీ, పంచాయతీ రాజ్ శాఖల సమీక్ష:

పిట్లం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అటవీ శాఖ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అటవీ శాఖ పరిధిలో ఉన్న రహదారి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మండలంలో ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం సర్పంచులు, కార్యకర్తలతో సమావేశమై వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

మొహమ్మద్ నగర్‌లో చెక్కుల పంపిణీ – భారీగా కాంగ్రెస్‌లో చేరికలు:

మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, ఇలాంటి పథకాలు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఎంతో తోడ్పాటును అందిస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు.


అనంతరం రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. మొహమ్మద్ నగర్ మండలంలోని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Post a Comment

Previous Post Next Post