[ఫోటో: చుక్కాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కాలక్షేప మండపాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్]
– షబ్బీర్ అలీ చేతుల మీదుగా మండపం, వసతి గృహాలు ప్రారంభం
తెలంగాణ డైలీ న్యూస్, మాచారెడ్డి : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మంగళవారం భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
ఆలయ ఆవరణలో దాతల సహకారంతో నిర్మించిన కాలక్షేప మండపాన్ని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రారంభించారు. అలాగే భక్తుల వసతి కోసం నిర్మించిన గృహాలను ప్రారంభించడంతో పాటు పలు కాటేజ్ పనులకు శంకుస్థాపన చేశారు.
గత సంవత్సరం శంకుస్థాపన చేసిన పనులకు ఏడాది వ్యవధిలోనే ప్రారంభోత్సవం జరగడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా ఆలయ పాత కమిటీ పదవీకాలాన్ని మరో మూడు సంవత్సరాల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఆలయ కమిటీ చైర్మన్‌గా శనిగరం కమలాకర్ రెడ్డి కొనసాగనుండగా, సభ్యులుగా బండారి యాదగిరి రెడ్డి, గట్టగోని రామ గౌడ్, కొత్త కాపు రాజారెడ్డి, పాత లక్ష్మీరాజ్యం, ఎర్రబోయిన దేవయ్య, కందాడి బాల్ రెడ్డి, కర్రోల్ల శంకర్ గౌడ్, నల్ల అంజయ్య, చింతల నర్సింలు కొనసాగనున్నారు.
ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ, చుక్కాపూర్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎంతో మహిమగలదని, స్వామివారి అనుగ్రహంతోనే తనకు ఆలయ అభివృద్ధి చేసే అవకాశం కలిగిందని తెలిపారు. మతభేదాలు లేకుండా భక్తి భావంతో సేవ చేయడం తన అదృష్టమని పేర్కొన్నారు.
మండుతున్న ఎండల్లో కూడా భారీ సంఖ్యలో వచ్చిన భక్తులను స్వాగతిస్తూ, ఆలయానికి రోడ్డు మరియు విద్యుత్ సౌకర్యాలు కల్పించడం తనకు లభించిన భాగ్యమని అన్నారు. చైర్మన్ కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి విశేషంగా జరిగిందని ప్రశంసిస్తూ, అందుకే ఆయనను తిరిగి చైర్మన్‌గా నియమించామని తెలిపారు.
ప్రతి ఆదివారం ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుందని, కోరికలు కోరిన వారికి స్వామివారు వరప్రదుడిగా నిలుస్తారని అన్నారు. భవిష్యత్తులో కూడా ఆలయ అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, నర్సింగరావు, రమేష్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, గూడెం శ్రీనివాస్ రెడ్డి, నౌసి నాయక్, దేవరాజ్ గౌడ్, సుతారి రమేష్, తిరుమల గౌడ్, బల్యాల సుదర్శన్, ఐరెని నరసయ్య, రాజగౌడ్, గంప ప్రసాద్, గోనే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



Post a Comment