[ఫోటో: కామారెడ్డి బస్టాండ్ వద్ద అద్దె బస్సును అడ్డుకుని ధర్నా చేస్తున్న ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నాయకులు. పోలీసుల బందోబస్తు మధ్య ఉద్రిక్తత]
👉అద్దె బస్సు టైర్లలో గాలి తీసివేత, పోలీసులపై ఆగ్రహం
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి : తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ఉదయం నుంచి కొనసాగుతుండగా కామారెడ్డి బస్టాండ్ వద్ద మంగళవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజాంసాగర్ వెళ్లడానికి డిపో నుంచి అద్దె బస్సును బయటకు తీయగా ఆర్టీసీ జేఏసీ నాయకులు అడ్డుకుని బస్సు టైర్లలో గాలి తీసేశారు.పోలీసుల పహారాలో ప్రైవేట్ డ్రైవర్ సాయి రెడ్డి అద్దె బస్సును బస్టాండ్ నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు వెంటనే అక్కడికి చేరుకుని బస్సును అడ్డగించారు. సమ్మెను విఫలం చేసే కుట్ర అని ఆరోపిస్తూ బస్సు టైర్లలో గాలి తీసేశారు. ప్రైవేట్ డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో బస్టాండ్‌లో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
మద్దతుదారుల అరెస్టు – కార్మికుల ఆగ్రహం:
కార్మికులకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు సమ్మెలో కూర్చున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేయడానికి యత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. "సమ్మెకు మద్దతిస్తే ఎలా అరెస్ట్ చేస్తారు?" అని నాయకులు ప్రశ్నించడంతో పోలీసులు, కార్మికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో ఓ డ్రైవర్‌ను పోలీసులు బురదలోకి తోసేశారని, ఘటనను వీడియో తీస్తున్న వ్యక్తి ఫోన్ లాక్కున్నారని కార్మిక నాయకులు ఆరోపించారు. సమ్మెకు మద్దతు తెలిపిన వారిని అరెస్టు చేసినందుకు పోలీసుల తీరును నిరసిస్తూ కార్మికులు బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టారు.
కార్మికుల వాదన:
ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ, తమకు మద్దతుగా సమ్మెలో కూర్చున్న వారిని అరెస్టు చేయడం సరికాదన్నారు. ఇది సమ్మెను నిర్వీర్యం చేసే కుట్ర అని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 32 డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఆర్డీవో జోక్యం:
ధర్నా చేస్తున్న కార్మికుల వద్దకు ఆర్డీవో గిరి చేరుకుని మాట్లాడారు. బస్సులు నడవకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్న వారు, సాధారణ ప్రజలు, పరీక్షలు రాసే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని, దారికి అడ్డు తప్పుకోవాలని సూచించారు. సమ్మెను యథావిధిగా కొనసాగించడానికి తమకు అభ్యంతరం లేదని ఆర్డీవో తెలిపారు.
అయితే కార్మికులు దీనికి ఒప్పుకోలేదు. బస్సులకు దారి ఇచ్చిన తర్వాత తాము సమ్మె చేయడంలో అర్థం లేదని, దారి ఇవ్వాలనే ఉద్దేశ్యం ఉంటే డ్యూటీలోనే ఉండేవాళ్లమని తేల్చిచెప్పారు. తమ బాధను, డిమాండ్లను ప్రభుత్వానికి నివేదించాలని ఆర్డీవోను కోరారు.
విద్యార్థుల అవస్థలు:
ఆర్టీసీ సమ్మెతో బాన్సువాడ డిపోతో పాటు జిల్లాలోని అన్ని డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. దీంతో ఓపెన్ టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సులు లేకపోవడంతో ప్రైవేట్ ఆటోలు, ఇతర వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది.
అధిక ఛార్జీల దందా:
ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడాన్ని అవకాశంగా తీసుకుని ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికుల నుంచి రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపించారు. పరీక్షలకు వెళ్లే విద్యార్థులు, సామాన్య ప్రజలు అధిక డబ్బులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు.
ఆర్టీసీ సమ్మెతో బాన్సువాడ డిపోతో పాటు జిల్లా వ్యాప్తంగా బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వాహనదారులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

Post a Comment