Top News

Self Enumeration | సెన్సస్ 2027 స్వీయ నమోదుపై అవగాహన

 


•సెన్సస్ 2027 స్వీయ నమోదుపై అవగాహన

•జిల్లాలో తొలి నమోదు చేసిన షబ్బీర్ అలీ

•మీడియాకు అవగాహన సదస్సు

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:

దేశవ్యాప్తంగా 2027లో చేపట్టనున్న ‘సెన్సస్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా స్వీయ నమోదు (Self Enumeration) ప్రక్రియపై కామారెడ్డి కలెక్టరేట్‌లో ఆది వారం ఓరియంటేషన్ సెషన్ నిర్వహించారు.  



మీడియాకు అవగాహన సదస్సు  

డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మీడియా ప్రతినిధుల కోసం నిర్వహించిన ఈ సెషన్‌లో కులగణన స్వీయ నమోదు విధానం, దాని ప్రాముఖ్యతపై సమగ్రంగా వివరించారు.  

ఆదర్శంగా షబ్బీర్ అలీ

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ  జిల్లాలో తొలి వ్యక్తిగా స్వీయ నమోదు ప్రక్రియను పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, "సెన్సస్ ప్రక్రియ దేశ అభివృద్ధికి ఎంతో కీలకం. నేను వ్యక్తిగతంగా నా వివరాలను సమర్పించి కులగణనలో స్వీయ నమోదు చేసుకున్నాను. ప్రజలు ఎలాంటి అపోహలు, అనుమానాలు లేకుండా ముందుకు వచ్చి తమ వివరాలను నిజాయితీగా నమోదు చేయాలి" అని కోరారు.  

"ఇది కేవలం గణాంకాల కోసం మాత్రమే కాదు. భవిష్యత్తులో ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు సరైన లబ్ధిదారులకు చేరేందుకు కీలకంగా ఉపయోగపడుతుంది. కులగణన ద్వారా ప్రతి వర్గానికి సంబంధించిన వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తాయి. దీంతో సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోగలుగుతుంది" అని ఆయన వివరించారు.  

పారదర్శక డిజిటల్ విధానం  

"ప్రతి కుటుంబం బాధ్యతగా భావించి సెన్సస్‌లో పాల్గొనాలి. డిజిటల్ విధానంలో జరుగుతున్న ఈ నమోదు ప్రక్రియ పారదర్శకంగా, సులభంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది" అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.  

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమా శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, ఐరేని సందీప్, మసూద్, కాళ్ళ గణేష్, కారంగుల అశోక్ రెడ్డి, షేరు, జిల్లా అధికార యంత్రాంగం, TUWJ(IJU) జిల్లా అధ్యక్షులు రాజనీకాంత్, అక్రీడిటేషన్ కమిటీ సభ్యులు అబిద్, కౌసర్, ఆశన్న, ఇలియాజ్, ఇతర మీడియా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.



Post a Comment

Previous Post Next Post