Collector Visit | అయిల్ ఫామ్ సాగుతో రైతులకు అధిక ఆదాయం: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

అయిల్ ఫామ్ సాగుతో రైతులకు అధిక ఆదాయం: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్  

ఏండ్రియల్‌లో రైతు బొక్క హన్మాండ్లు తోటను పరిశీలించిన కలెక్టర్  

అంతర్ పంటలతో ఏటా రూ.1.20 లక్షల ఆదాయం

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: సంప్రదాయ పంటలతో పాటు మార్కెట్ డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలు, అంతర్ పంటల సాగు ద్వారా రైతులు ఆదాయాన్ని పెంచుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. ప్రభుత్వ సబ్సిడీలు, సాంకేతిక సలహాలను వినియోగించుకొని మరిన్ని రైతులు అయిల్ ఫామ్ సాగుపై ముందుకు రావాలని పిలుపునిచ్చారు.


(వీడియో 👆)

బుధవారం తాడ్వాయ్ మండలం ఏండ్రియల్ గ్రామ శివారులో రైతు బొక్క హన్మాండ్లు మూడున్నర ఎకరాలలో సాగు చేస్తున్న అయిల్ ఫామ్ తోటను కలెక్టర్ సందర్శించారు. తోటలో మొక్కల పెరుగుదల, నిర్వహణ విధానాలు, సాగు పద్ధతులను పరిశీలించి పంట అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రైతు హన్మాండ్లు మాట్లాడుతూ, 2022లో మూడున్నర ఎకరాలలో అయిల్ ఫామ్ సాగును ప్రారంభించినట్లు తెలిపారు. అయిల్ ఫామ్‌తో పాటు అంతర్ పంటలుగా కూరగాయలు, సోయా, ఆకుకూరలు, పండ్ల తోటలను సాగు చేస్తూ ఏడాదికి సుమారు రూ.1.20 లక్షల ఆదాయం పొందుతున్నట్లు వివరించారు.

అయిల్ ఫామ్ సాగుకు ఉద్యానవన శాఖ ద్వారా గత నాలుగు సంవత్సరాలుగా ఎకరానికి రూ.4,200 చొప్పున సబ్సిడీ అందుతోందని, డ్రిప్ పరికరాలు కూడా మంజూరు చేశారని తెలిపారు. ప్రభుత్వ సహకారంతో సాగు ఖర్చులు తగ్గి దిగుబడి పెరిగిందన్నారు.

ప్రస్తుతం అయిల్ ఫామ్ పంట ధర టన్నుకు సుమారు రూ.23,000 ఉండగా, ఎకరానికి 10 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. దీర్ఘకాలికంగా లాభదాయకమైన పంటగా అయిల్ ఫామ్ రైతులకు మంచి ఆదాయ వనరుగా మారుతోందన్నారు.

అయిల్ ఫామ్ పంట కు సంబందించిన డ్రిప్ పరికరాలు 7 గురు రైతులకు  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అందించారు.

ఈ కార్యక్రమంలో జీహెచ్ఎస్ఓ జ్యోతి, సీపీఓ, డీఎల్పీఓ, ఎంఆర్ఓ, ఎంపీవో, సర్పంచ్, సంబంధిత శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.



ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఏండ్రియల్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. 

గ్రామంలోని లబ్ధిదారురాలు పడమటి కౌసల్య నిర్మించుకుంటున్న ఇంటి పనులను సందర్శించి నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన కలెక్టర్, ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత గడువులోగా ఇళ్లను పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేసుకోవాలని తెలిపారు.

లబ్ధిదారురాలు పడమటి కౌసల్యను కలెక్టర్ ఇంతకు ముందు ఎక్కడ నివాసం ఉండేవారని, ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఇంటి నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో సొంత ఇల్లు కల నెరవేరుతోందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామాల్లో గుడిసెలు లేకుండా, ప్రతి కుటుంబం పక్కా ఇంటిలో నివసించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గుడిసెలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో  pd హౌసింగ్ విజయపాల్, సంబంధిత అధికారులు, mro, గ్రామ సర్పంచ్ స్థానికులు పాల్గొన్నారు.







Post a Comment

Previous Post Next Post